జికా వైరస్‌పై అప్రమత్తం

26 Feb, 2016 23:31 IST|Sakshi
జికా వైరస్‌పై అప్రమత్తం

వైద్యాధికారుల సమీక్షలో కలెక్టర్ ఆదేశం
 
విశాఖపట్నం: జికా వైరస్ వ్యాధిని ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో  శుక్రవారం సాయంత్రం జికా వైరస్ వ్యాధిపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ వైరస్ ప్రస్తుతం అమెరికా, బ్రెజిల్, ఆఫ్రికా, సౌత్‌ఈస్ట్ ఏషియా, పసిఫిక్ ఐలాండ్స్‌లో వ్యాప్తి చెందిందన్నారు. మన దేశంలో ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కానప్పటికీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎయిర్‌పోర్టులు, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లలో జికా వైరస్‌పై అవగాహనకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ వ్యాధి ఎక్కువగా గర్భిణులు, నవజాతశిశువుల్లో కనిపిస్తున్నట్లు వరల్త్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికలు జారీ చేసిందన్నారు.

జికా వైరస్ వ్యాధి డెంగ్యూ వ్యాధి లక్షణాలను పోలి ఉంటుందని, పగటిపూట కుట్టే దోమ ద్వారానే ఈవ్యాధి వ్యాపిస్తుదని వివరించారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ నీటికుండీలకు మూతలుపెట్టడం, నిల్వ నీటిని లేకుండా చూడడం, ఖాళీ కొబ్బరిబొండాలు, టైర్లు లేకుండా చూసుకోవాలని కోరారు.  ప్రతి రోజు శుక్రవారం డ్రైడేగా పాటించాలన్నారు.   గత రెండేళ్లలో డెంగ్యూ వచ్చిన ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

వైద్యులు అందుబాటులో ఉండాలి
అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాల్లో వైద్యులంతా అన్ని వేళల్లో అందుబాటులో ఉండాలని, విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్  హెచ్చరించారు. మాతృ  మరణాలపై నిర్వహించే నెలవారీ సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరిలో ఏజెన్సీ ప్రాంతాల్లో రెండు గ్రామీణ ప్రాంతాల్లో రెండు, పట్టణ ప్రాంతాల్లో ఒకటి మొత్తం ఐదు మాతృ  మరణాలు సంభవించడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.   సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జె.సరోజని, డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, డీపీవో వెంకటేశ్వరరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు