కిల్తంపాలెం వద్ద జిందాల్‌ పవర్‌ ప్లాంట్‌?

16 Oct, 2019 09:58 IST|Sakshi
కిల్తంపాలెంలోని జిందాల్‌ తాత్కాలిక కార్యాలయం నుంచి భూములను పరిశీలిస్తున్న జిందాల్‌ ఎనర్జీ జనరల్‌ మేనేజర్‌ తపస్, కంపెనీ అధికారులు

250 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై స్థల పరిశీలన 

శృంగవరపుకోట రూరల్‌: జిందాల్‌ సౌత్‌ వెస్ట్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (జేఎస్‌డబ్ల్యూ) ఆధ్వర్యంలో ఎస్‌.కోట మండలం కిల్తంపాలెం పరిసర ప్రాంతాల్లో రూ. 2 వేల కోట్లతో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం మండలంలోని కిల్తంపాలెం సమీపంలోని జిందాల్‌ కంపెనీ భూములను జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ తపస్, డైరెక్టర్, హెడ్‌ ప్రాజెక్ట్‌ రాచూరి కనకారావు, మేనేజర్‌ విశాల్‌ సోని, కన్సల్టెంట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చీడిపాలెం, కిల్తంపాలెం, పెదఖండేపల్లి పరిసర గ్రామాల్లో జిందాల్‌ కంపెనీకి ఉన్న 650 ఎకరాల్లో 250 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం స్థల పరిశీలన, బొడ్డవర వద్ద ఉన్న విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు సోలార్‌ పవర్‌ అనుసంధానం తదితర సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

జిందాల్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటయితే ఈ ప్రాంతంలోని సుమారు 600 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. ఇక జేఎస్‌డబ్ల్యూ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలోనే మరో 60 ఎకరాల్లో పెయింట్‌ పరిశ్రమ, బొడ్డవర సమీపంలోని అమ్మపాలెం వద్ద 300 ఎకరాల్లో బ్రాండెక్స్‌ తరహా టెక్స్‌టైల్‌ పార్క్‌ వంటి పరిశ్రమను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. కాగా, జేఎస్‌డబ్ల్యూ అల్యుమినా లిమిటెడ్‌ పేరుతో ఈ ప్రాంతంలో సుమారు 1,165 ఎకరాల భూములు ఉన్నాయని, ఆ భూములను కంపెనీ వినియోగంలోకి తెచ్చే విధంగా ఆలోచనలు సాగిస్తున్నట్లు డైరెక్టర్, హెడ్‌ ప్రాజెక్ట్‌ రాచూరి కనకారావు వివరించారు. 

మరిన్ని వార్తలు