జేఎన్‌టీయూ(ఏ) వీసీ దుర్మరణం

23 Feb, 2017 01:46 IST|Sakshi
జేఎన్‌టీయూ(ఏ) వీసీ దుర్మరణం

అదుపుతప్పి లారీ కిందకు దూసుకెళ్లిన ఇన్నోవా కారు
వీసీ సర్కార్‌తో పాటు పీఏ, కారు డ్రైవర్‌ మృతి


పామిడి (గుంతకల్లు): అనంతపురం జిల్లా పామిడి మండల కేంద్రానికి సమీపంలో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, అనంతపురం (జేఎన్‌టీయూ–ఏ) వైస్‌ చాన్స్‌లర్‌ ఎంఎంఎం సర్కార్‌ (65) దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఆయనతోపాటు వ్యక్తిగత సహాయకుడు (పీఏ) బాబా ఫకృద్దీన్‌ (32), డ్రైవర్‌ నాగప్రసాద్‌ (30) అక్కడికక్కడే ప్రాణాలొదిలారు.  కర్నూలులోని పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల వార్షికోత్సవం కోసం బుధవారం సాయంత్రం జేఎన్‌టీయూ వీసీ తన పీఏతో కలిసి కారులో బయల్దేరారు.

పామిడికి సమీపంలోని ఖల్సా దాబా వద్ద కారు  అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని కుడివైపు రోడ్డులోకి దూసుకెళ్లింది. అదే సమయంలో గుత్తి నుంచి అనంతపురం వైపు లారీ (ఏపీ21 టీడబ్ల్యూ 6801) వస్తోంది. లారీ డ్రైవర్‌ అప్రమత్తమై బ్రేకు వేసేలోపు కారు వేగంగా లారీ ముందుభాగం కిందకు దూసుకెళ్లింది. కారు డ్రైవర్‌ నాగప్రసాద్, వెనుక సీటులో కూర్చున్న వీసీ ఎంఎంఎం సర్కార్, ఆయన పక్కనే కూర్చున్న పీఏ బాబా ఫకృద్దీన్‌ దుర్మరణందారు. కారు  టైరు పగలడంతో డివైడర్‌ను ఢీకొట్టి.. కుడివైపు రోడ్డులోని లారీ కిందకు దూసుకెళ్లిందని ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. వీసీ అంత్యక్రియలు శుక్రవారం వైజాగ్‌లో జరుగుతాయని బంధువులు తెలిపారు.

వీసీ మృతికి గవర్నర్‌ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: జేఎన్‌టీయూ వీసీ ఎమ్‌.ఎమ్‌.ఎమ్‌.సర్కార్‌ మృతి పట్ల తెలుగు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సర్కార్‌ మరణించడంతో రాష్ట్రం ఒక విద్యావేత్తను కోల్పోయిందన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.