హాస్టల్‌.. హడల్‌!

5 May, 2018 09:26 IST|Sakshi

సిబ్బంది జీతాల భారం విద్యార్థులదే..

విద్యుత్‌ బిల్లులు కూడా మెస్‌ బిల్లుల్లో జమ

యేటా రూ.1.21 కోట్ల భారం

విద్యార్థి భాగస్వామ్యం     పేరిట వ్యవహారం

పదేళ్లుగా సాగుతున్న తంతు

జేఎన్‌టీయూ(ఏ) పరిధిలోని పులివెందుల, కలికిరిలోని కళాశాల హాస్టళ్లలో ఉద్యోగుల జీతాలను, విద్యుత్‌ బిల్లులను విద్యార్థులతో సంబంధం లేకుండా చెల్లిస్తున్నారు. అయితే ఒక్క అనంతపురంలోనే విద్యార్థులపై భారం వేస్తుండటం గమనార్హం.

జేఎన్‌టీయూ:రాయలసీమలోనే ప్రతిష్టాత్మకమైన జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాలలో సీటు దక్కితే చాలు మురిసిపోతారు. ఇలాంటి కళాశాలలో వెలుగులోకి వచ్చిన వ్యాపార ధోరణి ఆ పేరుప్రఖ్యాతలకు మచ్చ తీసుకొస్తోంది. విద్యార్థి భాగస్వామ్య హాస్టల్స్‌ పేరిట సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేయడం విమర్శలకు తావిస్తోంది. సాంకేతిక విద్య కావడంతో విద్యార్థులు కూడా భారమైనా భరించక తప్పని పరిస్థితి నెలకొంది. క్యాంపస్‌ హాస్టళ్లలో కనీస వసతుల కల్పన వర్సిటీతో పాటు అధికారుల కనీస బాధ్యత. మొత్తం 8 హాస్టళ్లలో 1,932 మంది విద్యార్థులు ఉండగా.. నిర్వహణకు 110 మంది ఉద్యోగులను నియమించారు.

ఈ ఉద్యోగుల జీతభత్యాలను నేరుగా జేఎన్‌టీయూ(ఏ) చెల్లించాల్సి ఉండగా.. విద్యార్థి మెస్‌ బిల్లుల్లో కలుపుతున్నారు. ప్రతి ఉద్యోగికి నెల జీతం రూ.6,500 చొప్పున 110 మంది ఉద్యోగులకు ఏడాదికి రూ.85.80 లక్షలు చెల్లిస్తున్నారు. ఈ భారం విద్యార్థులపై పడుతోంది. ఇదే కాదు.. ఏడాదికి వచ్చే విద్యుత్‌ బిల్లు రూ.33లక్షలు కూడా విద్యార్థుల నుండే వసూలు చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి యేటా అదనంగా రూ.6,300 చెల్లించాల్సి వస్తోంది. అంటే విద్యార్థులు తిన్నా తినకపోయినా ఈ భారం మాత్రం మోయాల్సిందే. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు నెలకు రూ.1200, బీసీ కేటగిరీ విద్యార్థులకు నెలకు రూ.1200 చొప్పున ప్రభుత్వం ఉపకార వేతనాలను అందిస్తోంది. ఇందులో ఏడాదికి రూ.6,300 ఉపకార వేతనాల సొమ్మును ప్రతి విద్యార్థి సిబ్బంది జీతాలకు జమ చేయాల్సి వస్తోంది. ఈ దోపిడీ గత పది సంవత్సరాలుగా సాగుతోంది. ఇలా ఇప్పటి వరకు సిబ్బంది జీతాలు, విద్యుత్‌ బిల్లుల రూపంలో విద్యార్థులు రూ.12.10 కోట్లు అర్పించుకున్నారు.

బ్లాక్‌ గ్రాంట్‌ మొత్తం ఏమవుతోంది!
జేఎన్‌టీయూ అనంతపురం విద్యార్థులను ఏ విధంగా దగా చేస్తుందో బ్లాక్‌గ్రాంట్‌ వివరాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. హాస్టళ్లకు సంబంధించి 90 శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేస్తామని పదేళ్ల కిందట ప్రకటించారు. అయితే 19 మందిని మాత్రమే భర్తీ చేశారు. అయితే 90 మంది ఉద్యోగులకు చెల్లించే జీతాల మొత్తాన్ని బ్లాక్‌గ్రాంట్‌గా ప్రతి యేటా ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకుంటోంది. కానీ హాస్టల్‌ ఉద్యోగులకు మాత్రం ఆ మొత్తాన్ని చెల్లించని పరిస్థితి. నిధులు ఉన్నా జీతాల భారాన్ని విద్యార్థులపై మోపుతుండటం గమనార్హం. ఈ బ్లాక్‌గ్రాంట్‌ మొత్తాలను వర్సిటీ ఇతర అవసరాలకు వినియోగించుకోవడం విమర్శలకు తావిస్తోంది.

కాషన్‌ డిపాజిట్‌ కూడా తిరిగివ్వలేదు
హాస్టల్‌లో అడ్మిట్‌ అయిన వెంటనే కాషన్‌ డిపాజిట్‌గా రూ.3 వేలు కట్టించుకున్నారు. కోర్సు పూర్తయ్యాక వచ్చిన మెస్‌ బిల్లుకు ఈ మొత్తాన్ని కలపాలి. కానీ అలా చేయలేదు. మెస్‌ బిల్లు మొత్తం కట్టినా కాషన్‌ డిపాజిట్‌ తిరిగివ్వలేదు. మా అన్న గతేడాది బీటెక్‌ ఫైనలియర్‌ పూర్తి చేశారు. కానీ కాషన్‌ డిపాజిట్‌ వెనక్కివ్వలేదు. ఉద్యోగం వచ్చిన వారితో ముందస్తుగానే మెస్‌ బిల్లు కట్టించుకున్నారు. మెస్‌ బిల్లు పోనూ తక్కిన మొత్తం తిరిగివ్వడం లేదు.– విశాల్, బీటెక్‌ మూడో సంవత్సరం, జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాల.

విద్యార్థులపై భారం తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం
హాస్టల్స్‌ విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తున్నాం. విద్యుత్‌ బిల్లులు తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలిస్తున్నాం. సోలార్‌ విద్యుదుత్పత్తితో కరెంట్‌ బిల్లులు తగ్గే అవకాశం ఉండటంతో ఆ దిశగా ప్రయత్నిస్తున్నాం.– ప్రొఫెసర్‌ రామానాయుడు, ప్రిన్సిపాల్, చీఫ్‌ వార్డెన్,జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాల

మరిన్ని వార్తలు