రోడ్డెక్కిన జేఎన్‌టీయూ విద్యార్థులు

16 Oct, 2019 10:08 IST|Sakshi
ప్రధాన గేట్‌ వద్ద బైఠాయించిన జేఎన్‌టీయూ విద్యార్థులు

పస్తులుంటూ రోజంతా బైఠాయింపు

నిధులున్నా నిర్వహణ లోపాలతో ఇబ్బందులు

ప్రిన్సిపాల్‌ పరిష్కరించడం లేదు... 

వీసీ రావాల్సిందే   

విజయనగరం అర్బన్‌: పట్టణంలోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు కోపం వచ్చింది. కళాశాల నిర్వాహణ లోపాలను సరిద్దాలని కొన్ని నెలలుగా చెబుతున్నా... ప్రిన్సిపాల్‌ పట్టించుకోకపోవడంతో వారిలో నిరసన పెల్లుబికింది. ఓపిక నశించి ఒక్కసారిగా రోడ్డెక్కారు. మంగళవారం ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు తాగకుండా రాత్రి పొద్దుపోయే వరకు ప్రధాన గేట్‌ ఎదుట   బైఠాయించారు. మండుటెండలో సిమెంట్‌ గ్రౌండ్‌పై రోజంతా మౌనప్రదర్శన చేశారు. మధ్యలో కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ జి.సరస్వతి, వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాసరావు నిరసన ప్రాంగణానికి వచ్చి సముదాయించారు. సమస్యలు రాసిస్తే టైమ్‌ బాండ్‌ పెట్టి పరిష్కరిస్తామని నిరసన మానుకోవాలని కోరారు. అయితే గత కొద్ది నెలలుగా మీ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలేనని ప్రత్యేకించి రాసివ్వాల్సిన సమస్యలు లేవని విద్యార్థులు ఖరాకండిగా చెప్పారు.

ఒక్కొక్కరుగా వెళ్లి చెబుతుంటే భయపెట్టి పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, అందుకే సామూహికంగా నిరసనలు చేపడుతున్నామని తేల్చి చెప్పారు. కళాశాల నిర్వహణంలో ప్రిన్సిపాల్‌ విఫలమయ్యారని ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను కూడా విద్యార్థులకు అందించలేకపోతున్నారని విద్యార్థులు ధ్వజమెత్తారు. బోధన, పరిశోధనశాలల నిర్వహణ సామగ్రి కోసం గత ఏడాది విడుదల చేసిన రూ.కోట్ల నిధులు ఇప్పటికీ వినియోగించడం లేదని దాని వల్ల నాణ్యమైన విద్యను అందుకోలేక పోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వసతిగృహం విద్యార్థుల సమస్యలు పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం అవసరం పడే స్టేషనరీ దుకాణం గత కొద్ది నెలలుగా లేదని, ఏ అవసరం వచ్చినా ఆరు కిలోమీటర్ల దూరంలోని పట్టణంలోకి వెళ్లాల్సి వస్తుందని విలపించారు.

వైద్య సదుపాయాలు  కళాశాల ప్రాంగణంలో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఇలాంటి సమస్యలన్నింటినీ  ప్రిన్సిపాల్‌ పరిష్కారమార్గాన్ని చూడకుండా నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారనే ఉద్దేశంతో యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ స్వయంగా వచ్చి పరిష్కరించాలనే లక్ష్యంగా   సామూహికంగా నిరసనలు చేపడుతున్నామని చెబుతున్నారు. మధ్యాహ్నం 3.00 గంటల సమయంలో యూనివర్సిటీ ప్రధాన కార్యాలయానికి ఆందోళన విషయాన్ని తెలియజేశారు. నిరసనలోని విద్యార్థులతో యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఫోన్‌ ద్వారా మాట్లాడారు. అయితే వచ్చిన ఫోన్‌ కాల్‌ వైస్‌చాన్సలర్‌  నుంచి కాకపోవడంతో విద్యార్థులు సంతృప్తి చెందలేదు. బైఠాయింపు కొనసాగిస్తామని అధికారులతో చెప్పారు. దాంతో పొద్దుపోయినా గేట్‌ వద్ద  బైఠాయింపు కొనసాగించారు. 

మరిన్ని వార్తలు