ఎంటెక్కు.. ‘కొత్త’లుక్కు 

20 Jul, 2019 09:20 IST|Sakshi
జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాల   

జేఎన్‌టీయూ క్యాంపస్‌లో మరో కళాశాల  

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ పేరుతో ఏర్పాటు  

పాలకమండలి సమావేశంలో ఆమోదానికి ప్రతిపాదన 

జేఎన్‌టీయూ(ఏ)కు ఎన్‌బీఏ(నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌) గుర్తింపు రాలేదు. ఫలితంగా నిధుల మంజూరుకు ఆటంకం కలుగుతోంది. దీంతో ఆలోచనలో పడిన వర్సిటీ ఉన్నతాధికారులు ఎంటెక్కుకు ‘కొత్త’ లక్కు దక్కేలా ప్లాన్‌ చేశారు. జేఎన్‌టీయూ క్యాంపస్‌లో మరో కళాశాల ఏర్పాటు చేసి అధ్యాపక, విద్యార్థి నిష్పత్తి తగ్గించి నిధులు రాబట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధం చేసిన ఉన్నతాధికారులు పాలకమండలి ముందుంచి ఆమోదం పొందాలని చూస్తున్నారు.  – జేఎన్‌టీయూ 

జేఎన్‌టీయూ(ఏ) క్యాంపస్‌లో మరో ఇన్‌స్టిట్యూట్‌ కళాశాల ఏర్పాటు చేయనున్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ పేరుతో నూతనంగా ప్రత్యేక కళాశాలను ఏర్పాటు చేయడానికి కసరత్తు జరుగుతోంది. వచ్చే పాలకమండలి సమావేశంలో ఆమోదించడానికి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. నూతన కోర్సులతో పాటు ఎంటెక్‌ కోర్సులను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌లో తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.  

ఎన్‌బీఏ గుర్తింపు రాక.... 
జేఎన్‌టీయూ(ఏ) ఇంజినీరింగ్‌ కళాశాలకు ఎన్‌బీఏ( నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌) గుర్తింపుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ మంజూరు కాలేదు. మరో దఫా ఎన్‌బీఏ గుర్తింపునకు పునఃసమీక్ష కోరినా నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో క్యాంపస్‌ కళాశాలకు రావాల్సిన నిధుల మంజూరుకు ఆటంకం ఏర్పడింది. దీంతో కళాశాలలో సాంకేతిక పరికరాలు, నూతన ల్యాబ్‌లు , సెమినార్లు, సింపోజియంలు, ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌లు నిర్వహించుకోవడానికి మంజూరు చేసే నిధులకు బ్రేక్‌ పడింది. ప్రస్తుతం టెక్విప్‌–3 (టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ క్వాలిటీ ఇప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌) నడుస్తుండగా...2020 ఆగస్టు తర్వాత ప్రారంభమయ్యే టెక్విప్‌–4 నిధుల మంజూరుకు అవరోధం ఏర్పడింది. దీంతో నష్టనివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైన వర్సిటీ అధికారులు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్సెడ్‌ స్టడీస్‌ కళాశాలను నూతనంగా ఏర్పాటు చేయనున్నారు.  

అధ్యాపక.. విద్యార్థి నిష్పత్తిలో వ్యత్యాసం 
జేఎన్‌టీయూ (ఏ)క్యాంపస్‌ కళాశాలకు ఎన్‌బీఏ గుర్తింపు రాకపోవడానికి ప్రధాన కారణం విద్యార్థి.. అధ్యాపక నిష్పత్తికి వ్యత్యాసం అధికంగా ఉంది. ప్రస్తుతం 6 బీటెక్‌ బ్రాంచ్‌లు, 24 ఎంటెక్‌ బ్రాంచ్‌లను నిర్వహిస్తున్నారు. బీటెక్‌ బ్రాంచ్‌లో అయితే 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు, ఎంటెక్‌లో అయితే ప్రతి 12 మందికి ఒక ఫ్యాకల్టీ మెంబర్‌ ఉండాలి. ఒక బ్రాంచ్‌ మొత్తానికి 1:2:6 ( ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్, ఆరు మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు) కేడర్‌ రేషియో ప్రకారం నియమించాలని ఏఐసీటీఈ(ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌) నిర్ధారించింది.

ప్రస్తుతం జేఎన్‌టీయూ(ఏ) క్యాంపస్‌లో మొత్తం 286 మంది ఫ్యాకల్టీ మెంబర్లు అవసరం కాగా, 101 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. తక్కిన 185 మంది ఫ్యాకల్టీ మెంబర్లను భర్తీ చేయాల్సి ఉంది. అవసరమైన మేరకు ఫ్యాకల్టీ మెంబర్లు లేకపోవడంతో ఎన్‌బీఏ గుర్తింపు రాలేదు. దీంతో బీటెక్‌ బ్రాంచ్‌లకు ఒక కళాశాల, ఎంటెక్‌ బ్రాంచ్‌లకు మరో కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో విద్యార్థి, అధ్యాపక నిష్పత్తి వ్యత్యాసం లేకుండా ఉంటుంది. ఎంటెక్‌లో 24 బ్రాంచ్‌ల్లో 12 బ్రాంచులను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్సెడ్‌ స్టడీస్‌ కళాశాలకు బదిలీ చేయనున్నారు.  

ప్రత్యేక అనుమతితో ఉపకార వేతనాలు 
వర్సిటీలోని కొందరు ఎంటెక్‌ విద్యార్థులకు ఇప్పటికే ఉపకారవేతనాలు అందుతున్నాయి. ఈ క్రమంలో ప్రత్యేక కళాశాలను ఏర్పాటు చేస్తే ఉపకారవేతనాల మంజూరుకు ఆటంకం ఏర్పడకుండా న్యూఢిల్లీకి ప్రత్యేక కమిటీని పంపనున్నారు. ఏఐసీటీఈ ప్రత్యేక అనుమతితో విద్యార్థుల ఉపకారవేతనాలు మంజూరుకు చొరవ తీసుకోనున్నారు. వచ్చే పాలకమండలి సమావేశంలో ప్రత్యేక కళాశాలకు ఆమోదం తెలపనుంది.  

39 ఎకరాల్లో నూతన ఎంబీఏ కళాశాల 
జేఎన్‌టీయూ(ఏ) క్యాంపస్‌లో ఎంబీఏ కళాశాలకు నూతన భవనాలను నిర్మించనున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల అనంతపురం నుంచి 39 ఎకరాలను జేఎన్‌టీయూ(ఏ)కు బదలాయించనున్నారు. ఇందులో నూతనంగా ఎంబీఏ కళాశాల నిర్మించేందుకు టెండర్లు ఆహ్వానించనున్నారు. 

ఎంటెక్‌ కోర్సులను బలోపేతం చేస్తాం 
ఎంటెక్‌ కోర్సులను బలోపేతం చేయడానికి ప్రత్యేక కళాశాల, వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. అధ్యాపక. విద్యార్థి నిష్పత్తి వ్యత్యాసం తగ్గాలి. శాశ్వత ప్రాతిపదికన బోధన ఉద్యోగాల భర్తీ చేయాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాము. ఎంటెక్‌ కోర్సులో 24 బ్రాంచుల్లో 12 బ్రాంచులను నూతన కళాశాలలో నిర్వహించనున్నాం.  
– ప్రొఫెసర్‌ ఎస్‌.శ్రీనివాస్‌ కుమార్, వీసీ, జేఎన్‌టీయూ(ఏ)   

మరిన్ని వార్తలు