లక్షలు నొక్కిన టక్కరులు!

20 Jan, 2014 01:49 IST|Sakshi
కాకినాడ రూరల్, న్యూస్‌లైన్ :దూడ లేదని పాలివ్వడానికి మొరాయించే పాడిపశువును నమ్మించడానికి తోలులో గడ్డికూరి దూడ ఆకారంలో తయారు చేసి పొదుగు గుడిపినట్టు చేసి, చేపులు రప్పిస్తుంటారు పశుపాలకులు.  ఆ గడ్డిబొమ్మను ‘చేటపెయ్యి’ అంటారు. చేటపెయ్యితో పశువును నమ్మించిన బాపతుగానే నిరుద్యోగులను పశుసంవర్ధకశాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి లక్షలు దండుకున్నారు దగాకోరులు. కామధేనువే తమ వద్దకు నడిచి వస్తోందన్నంత సంబరపడిన నిరుద్యోగులు తంటాలు పడో, తాకట్టు పెట్టో తలో లక్షా, లక్షన్నరా చెల్లించుకున్నారు. అయితే తమకు దక్కబోయింది పాడి ఆవు కాదని, ముగ్గురు కలిసి ఆడిన మోసక్రీడలో తాము పావులమయ్యామని, తమ పని వట్టిపోయిన గొడ్డు పొదుగును పితకబోయినట్టయిందని తేలడంతో లబోదిబోమంటున్నారు.
 
 పశుసంవర్ధక శాఖలో పని చేస్తున్న ఓ డాక్టర్, ఓ అటెండర్, మరో వ్యక్తి కలిపి నాలుగు జిల్లాలకు (తూర్పు, పశ్చిమ, కృష్ణా, విశాఖపట్నం) చెందిన 33 మందిని నమ్మించి, రూ.45 లక్షల వరకు కాజేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రమైన కాకినాడలోని పశుసంవర్థకశాఖ పోలీ క్లినిక్ కేంద్రంగా జరిగిన దగాపర్వం గురించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ ఆర్టీఓ కార్యాలయం సమీపంలోని పద్మానగర్‌లో నివసిస్తున్న శీరం లలితాదేవి పశుసంవర్ధకశాఖ పోలీ క్లినిక్‌లో అటెండర్‌గా పనిచేస్తోంది. అదే క్లినిక్‌లో వెటర్ననరీ అసిస్టెంట్‌గా పని చేస్తున్న డాక్టర్ కాకర్ల వరప్రసాద్ అలియాస్ వేళంగి వరప్రసాద్ కరప మండలం వేళంగి పశువైద్యశాల ఇన్‌చార్జిగా కూడా వ్యవహరిస్తున్నాడు. కరప మండలం పెనుగుదురుకు చెందిన పిల్లి వీర్రాజు రాజమండ్రి పేపరు మిల్లులో పేపర్ కట్టర్‌గా పనిచేస్తున్నాడు. 2011లో పోలీ క్లినిక్‌లో అటెండర్‌గా చేరిన లలితాదేవి విధులకు తరచూ గైర్హాజరవుతోందని జిల్లా అధికారులు 2013 జూలై 7న సస్పెండ్ చేశారు. 
 
 సస్పెండయ్యాక కొలువుల కుతంత్రం
 అనంతరం ఆమె డాక్టర్ వరప్రసాద్ ద్వారా పశు సంవర్ధకశాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను ప్రలోభపెట్టింది. వారికి నమ్మకం కలిగేలా  కొందరికి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇస్తున్నామని, రాజమండ్రి ఆనంద్ రీజెన్సీకి రావాలని చెప్పడంతో డబ్బులు చెల్లించిన నిరుద్యోగులు అక్కడకు వెళ్లారు. ఆనంద్ రీజెన్సీలో పిల్లి వీర్రాజును డాక్టర్ వేళంగి వరప్రసాద్‌గా పరిచయం చేసి రెండు, మూడు రోజుల్లో పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తామని చెప్పించింది. ఆ నిరుద్యోగ యువకులు తమకు ఉద్యోగం రానుందని స్నేహితులకు చెప్పడంతో వారిలో మరికొందరు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించారు. నాలుగు రోజుల క్రితం లలితాదేవి డబ్బులు చెల్లించిన యువకులకు పోస్టింగ్ ఆర్డర్లు అంటూ ధృవీకరణ పత్రాలు పంపిణీ చేసింది. అవి నకిలీవని తేలడంతో హతాశులైన నిరుద్యోగ యువకులు గత రెండు రోజులుగా ఆమెపై చేయి చేసుకున్నారు. తమ సొమ్ములు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు. 
 
 ఉన్నతాధికారులకూ ప్రమేయం?
 ఈ వ్యవహారం తెలిసిన జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు రెండురోజుల క్రితం డాక్టర్ వరప్రసాద్‌ను, లలితాదేవిని పిలిపించి ప్రశ్నించారు. లలితాదేవి ఎవరో తనకు తెలియదని, ఆమె సొమ్ములు వసూలు చేయడానికి, తనకూ ఎలాంటి సంబంధం లేదని డాక్టర్ వరప్రసాద్ అనడంతో అధికారులు మిన్నకున్నారు. ఈ నేపథ్యంలో లలితాదేవిపై సస్పెన్షన్ రద్దు చేస్తూ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. దీన్ని బట్టి ఈ వ్యవహారంలో ఆ శాఖ ఉన్నతాధికారులకూ ప్రమేయం ఉందన్న అనుమానాన్ని బాధిత యువకులు వ్యక్తం చేస్తున్నారు. 
 
 కాగా డబ్బులు చెల్లించిన వారిలో కొందరు లలితాదేవిపై చేయి చేసుకోవడంపై ఆమె తల్లి పద్మావతి ఆదివాకం సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు లలితాదేవి, డాక్టర్ వరప్రసాద్, పిల్లి వీర్రాజులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారు చెపుతున్న విషయాలు పరస్పరం పొంతన లేకుండా ఉన్నాయి. లలితాదేవి తాను వీర్రాజు ద్వారా వసూలు చేసిన సొమ్ము డాక్టర్ వరప్రసాద్‌కే ఇచ్చానని చెపుతుండగా.. ఆమె ఎవరో తనకు తెలియనే తెలియదని డాక్టర్ వరప్రసాద్ అంటున్నాడు. తనకు కూడా ఉద్యోగం ఇస్తాననడంతో లలితాదేవి చెప్పినట్టు డాక్టర్‌గా నటించానని వీర్రాజు అంటున్నాడు. మొత్తం మీద ఉద్యోగాల ఎరతో నిరుద్యోగులకు టోకరా వేసిన ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఏమిటో.. పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. ఏదేమైనా.. నెలనెలా ఠంచనుగా జీతాలు పొందే సర్కారీ కొలువు దక్కుతుందని ఆశపడితే తమ చేతి చమురే భారీగా వదిలిందని డబ్బులు చెల్లించిన నిరుద్యోగులు గగ్గోలు పెడుతున్నారు.
 

 

మరిన్ని వార్తలు