పంచాయతీ కార్యదర్శులు ‘అవుట్‌’

21 Feb, 2018 12:24 IST|Sakshi
పంచాయతీ కార్యాలయ భవనం

ప్రభుత్వం కసరత్తు

త్వరలో నోటిఫికేషన్‌ జారీ

అభ్యర్థుల ఆందోళన

సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగాలు భర్తీ అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతితో భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. ఈ మేరకు ఇటీవల పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి నారాలోకేష్‌ అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. గ్రామానికి ఒక కార్యదర్శి నియమించే ప్రక్రియను తెరపైకి తీసుకువచ్చినట్లు తెలిసింది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోచుకోక.. ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి నోటిఫికేషన్‌ పడుతుందా? ఎలాగోలా కష్టపడి ఉద్యోగం సాధిద్దామా? అనే నిరుద్యోగుల ఆశలకు ప్రభు త్వ నిర్ణయం ప్రతిబంధకంగా పరిణమించనుంది.

జిల్లాలో 970 పంచాయతీలున్నాయి. వీటిని పాలనా సౌలభ్యం నిమిత్తం వీటిని 487 క్లస్టర్లుగా విభజించారు. క్లస్టర్‌కు ఒకరు చొప్పున కార్యదర్శిని నియమించాల్సి ఉండగా.. గతంలో ప్రభుత్వం 360 ఉద్యోగాలు భర్తీ చేసింది. కార్యదర్శుల కొరత నేపథ్యంలో ఒక్కో కార్యదర్శి తనకు కేటాయించిన క్లస్టర్‌కు రెగ్యులర్‌గానూ.. మరో క్లస్టర్‌కు ఇన్‌చార్జ్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 342 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. క్లస్టర్‌కు ఒకరు చొప్పున నియామకం చేపట్టినా జిల్లాకు ఇంకా 145 మంది అవసరం. కానీ ఇంత వరకూ ఎంపిక చేసిన దాఖలాలు లేవు. జిల్లాలో గ్రామకార్యదర్శుల కొరత వేధిస్తుండటంతో పాలనలో ఇబ్బందులు నెలకొన్నాయి. మరోవైపు నాలుగైదు మైనర్‌ పంచాయతీలను కలిపి క్లస్టర్‌గా ఏర్పాటు చేసి వాటికి కార్యదర్శిని నియమించారు. తద్వారా పనిభారం పెరగడంతోపాటు కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రతి పంచాయతీకి ఓ కార్యదర్శి
ప్రస్తుతం పాలనా సౌలభ్యం నిమిత్తం ప్రతి గ్రామ పంచాయతీకి ఓ కార్యదర్శిని నియమించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఒకవేళ ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే జిల్లావ్యాప్తంగా 628 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. ఈ ఎన్నిక ప్రక్రియ అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా చేపట్టనున్నారు. త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనున్నట్లు సమాచారం.

నెలాఖరుకు స్పష్టత
ఉద్యోగాల భర్తీ విషయంలో నెలాఖరుకు స్పష్టత రానుంది. పంచాయతీ కార్యదర్శికి కనీస విద్యార్హతగా డిగ్రీని నిర్ణయించారు. రాత పరీక్షలో మెరిట్‌సాధించిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పోస్టుల భర్తీకి జిల్లా స్థాయిలో ఐదుగురితో ఒక సెలక్షన్‌ కమిటీ ఏర్పాటు కానుంది. జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా పంచాయతీ అధికారి, జెడ్పీ సీఈఓ,  రెవెన్యూ, మరో శాఖ అధికారిని సభ్యులుగా నియమించనున్నారు. అభ్యర్థుల ఎంపికలో కమిటీతే తుది నిర్ణయం.

నిరుద్యోగుల్లో ఆందోళన
ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ అటుంచితే నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం ప్రతి ఉద్యోగం ఒప్పంద ప్రాతిపదిక నిర్వహించడంతో తాము ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం చేస్తున్న నిరీక్షణకు తెర పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఉద్యోగం అవుట్‌ సోర్సింగ్‌లో చేపడితే ఇక.. ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడోస్తాయని ప్రశ్నిస్తున్నారు.

ఈవోపీఆర్డీ, కంప్యూటర్‌ ఆపరేటర్ల నియామకం!
జిల్లాలోని 49 మండలాల పరిధిలో 42 మంది ఈఓపీఆర్డీలు విధులు నిర్వర్తిస్తుండగా ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీని పదోన్నతుల ద్వారా చేపట్టనున్నారు. ప్రస్తుతం 125 మంది కంప్యూటర్‌ ఆపరేటర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి నియమించే తరుణంలో పెద్ద పంచాయతీకి కంప్యూటర్‌ ఆపరేటర్‌ నియామకం తప్పనిసరి. వీటిని సైతం భర్తీ చేసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు