ఈఎస్‌ఐలో అమ్మకానికి ఉద్యోగాలు

13 Feb, 2019 05:28 IST|Sakshi

1,152 పోస్టులకు రూ.23 కోట్లు పైనే వసూళ్లకు ప్రణాళిక

ఎన్నికల ముందు భారీ అవినీతికి తెరలేపిన మంత్రి

కేబినెట్‌ ఆమోదం లేకుండానే ఆమోదించినట్లు అధికారులతో సంతకాలు

పోస్టుల నియామక ఫైలును తీవ్రంగా వ్యతిరేకించిన ఆర్థిక శాఖ 

8వ తేదీ కేబినెట్‌లో ఆమోదం లేదు..9, 10 తేదీల్లో ఉన్నతాధికారితో సంతకాలు

మందులు సరఫరా చేసే కాంట్రాక్టరుకే నియామకాలు ఇచ్చేలా ఒప్పందం

సాక్షి, అమరావతి:  కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐ)లో భారీ అవినీతికి తెరలేచింది. ఈఎస్‌ఐలో ఉన్న ఖాళీ పోస్టులను అమ్మి రూ.కోట్లు కొల్లగొట్టేందుకు ఓ కాంట్రాక్టర్‌తో కలిసి మంత్రి ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగా మొత్తం 1,152 పోస్టులు అమ్మకానికి పెట్టారు. ఇప్పటికే ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడమేకాకుండా వారితో అడ్వాన్సు రూపేణా మంత్రి భారీ మొత్తం తీసుకున్నట్టు సమాచారం. నాలుగున్నరేళ్లు ఒక్క పోస్టునూ భర్తీ చేయకుండా మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందనగా జేబులు నింపుకునేందుకు ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే మళ్లీ కుదరదని తెలుసుకున్న నేతలు ఆదరాబాదరా కేబినెట్‌ పెట్టామని చెప్పి ఆర్థిక శాఖ అభ్యంతరాలను కూడా కాదని నేడో రేపో జీవో ఇప్పించుకోబోతున్నారు. 

కేబినెట్‌ ఆమోదం లేకుండానే
ఈనెల 8వ తేదీన (శుక్రవారం) కేబినెట్‌ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఈ పోస్టులకు ఆమోదం పొందామని బయటకి చెప్పారు. అయితే ఆ సమావేశంలో ఎలాంటి ఆమోదం పొందలేదు. ఈనెల 9, 10 (శనివారం, ఆదివారం) తేదీల్లో సదరు మంత్రి నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశారు. ఆర్థిక శాఖ తిరస్కరించిన ఫైలును కాకుండా మరో ఫైలును సృష్టించి తెరచాటు మంతనాలు చేశారు. కేబినెట్‌ ఆమోదం పొందినట్టు నకిలీ రిజల్యూషన్‌ నెంబర్‌ సృష్టించారు. మొత్తం పోస్టులను ఔట్‌సోర్సింగ్‌ కింద నియమించుకునేలా ఆమోదం పొందిన అనంతరం ఈ ఫైలు కార్మిక శాఖకు వెళ్లింది. నేడో రేపో ఈ పోస్టులను నియమించుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు కార్మిక శాఖ అధికారులు తెలిపారు.

ఈఎస్‌ఐ ఆస్పత్రులకు మందులు సరఫరా చేసే జాస్తి వీరాంజనేయులు అనే కాంట్రాక్టర్‌కే ఈ నియామక బాధ్యతలు అప్పజెబుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. మంత్రికి అత్యంత సన్నిహితుడైన ఆ కాంట్రాక్టర్‌ ప్లాన్‌ ప్రకారమే ఈ వ్యవహారం నడిచినట్లు తెలిసింది. గత కొన్నేళ్లుగా జాస్తి వీరాంజనేయులు ఈఎస్‌ఐ కి చెందిన 78 డిస్పెన్సరీలతో పాటు ప్రాంతీయ ఆస్పత్రులకు మందులు సరఫరా చేస్తున్నారని, తాజాగా నియామకాలకు సంబంధించి కూడా రంగంలోకి దిగారని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో చిన్న కేడర్‌ పోస్టులను ఒక్కో పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు, వైద్యుల పోస్టుకు రూ.5లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ వసూలుకు సిద్ధమయ్యారు. ఇలా సుమారు రూ.23.04 కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు.

ఆర్థిక శాఖ తీవ్రంగా వ్యతిరేకించినా...
కార్మికరాజ్యబీమా సంస్థ పోస్టుల నియామకంపై ఆర్థిక శాఖకు కొన్ని నెలల క్రితం ప్రతిపాదనలు పంపించారు. ఇందులో 130 మంది వైద్యులు, 400 మంది పారామెడికల్‌ సిబ్బంది, 622 మంది స్వీపర్లు/అటెండర్లుకు ప్రతిపాదన పంపిస్తే ఆర్థిక శాఖ తీవ్రంగా ఆక్షేపించింది. వాస్తవానికి కార్మికులకు నిధులు చెల్లించడంతో రాష్ట్రం 1/8వంతు మాత్రమే భరిస్తుందని, మిగతా నిధులు అంటే 7/8 వంతు కేంద్రం భరిస్తుందని, కానీ ఇందుకు భిన్నంగా జరుగుతోందని, దీనికి ఆమోదం తెలుపలేమని చెప్పింది. పైగా సెక్యూరిటీ, స్వీపర్లు, శానిటేషన్‌ సిబ్బందిని ఎప్పుడూ ప్రభుత్వం నియమించదని, ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీకి ఇచ్చేస్తుందని, కానీ ఇక్కడ ప్రభుత్వమే సిబ్బంది నియామకం చేస్తుందని ఫైలులో పేర్కొన్నారని ఆర్థిక శాఖ ఆక్షేపించింది. ఆ ఫైలును వ్యతిరేకించడంతో నెలన్నర తర్వాత మళ్లీ ఫైలును మార్చి పెట్టారు. అప్పుడు కూడా ఆర్థిక శాఖ తిరస్కరించింది. దీంతో మంత్రితో పాటు ఆ శాఖ అధికారులు అడ్డదారిలో అనుమతులు తెచ్చుకున్నారు.

నియామకాలు ఎలా చేస్తారో నాకు తెలియదు
ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో పనిచేయడానికి 1,100 పైగా పోస్టులకు ప్రతిపాదన పంపిన విషయం నిజమే. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను బట్టి నడుచుకుంటాం. పోస్టులన్నీ ఔట్‌సోర్సింగ్‌ కిందే నియమించే విషయం మాత్రమే తనకు తెలుసు. మిగతా విషయాలు నాకు తెలియవు.
–డా.విజయకుమార్, డైరెక్టర్, ఈఎస్‌ఐ

మరిన్ని వార్తలు