ఓడిపోతారని తెలిసే టికెట్‌ ఇచ్చారు: జోగి రమేష్

13 Mar, 2020 18:58 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీకి అభ్యర్థులే కరువయ్యారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ విమర్శించారు. టీడీపీలో నామినేషన్ వేసే వారు లేరు, బీఫార్మ్ తీసుకునేవారు లేరని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెఎస్సార్‌ సీపీ నామినేషన్లు అడ్డుకుంటున్నారని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత శాసనసభ ఎన్నికల్లో టీడీపీని 23 సీట్లకు పరిమితం చేసినా చంద్రబాబుకు బుద్ది రాలేదని విమర్శించారు. చంద్రబాబు నాయకత్వంపై టీడీపీ నేతలకు నమ్మకం పోయిందన్నారు. జగన్ సంక్షేమ పాలన చూసే టీడీపీ ముఖ్య నేతలు తమ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు.  గతంలో చంద్రబాబు దళితులకు రాజ్యసభ టిక్కెట్లు ఇవ్వలేదని.. ఇప్పుడు ఓడిపోతారని తెలిసే వర్ల రామయ్యకు టికెట్‌ ఇచ్చారని మండిపడ్డారు.

వర్ల రామయ్యను బలిపశువును చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబును టీడీపీ దళిత నేతలు నిలదీయాలని పిలుపునిచ్చారు. గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేశారని.. ప్రతిపక్ష నేతగా కూడా చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు. అందుకే వైయస్ జగన్‌ను ప్రజలు గెలిపించారని, మాట ఇస్తే నిలబెట్టుకునే నాయకుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఏకైక సీఎం జగన్‌ అని.. తొమ్మిది నెలల జగన్ పాలన చూసి నేతలు క్యూ కడుతున్నారని జోగి రమేష్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు