మా పార్టీకి రావచ్చుగా..

8 Mar, 2014 02:52 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ‘నేను సీఎంగా ఉన్నప్పుడు మీరు అడిగిన పనులు చేశానుగా. ఈ సారి ఎన్నికల్లో మా పార్టీ తరపున పోటీ చేయొచ్చుగా. ఒక సారి వచ్చి కలిస్తే అన్నీ మాట్లాడుకుందాం’ జిల్లాలో ముఖ్యమైన రాజకీయ నాయకులకు మారూ. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోన్ చేసి ఈ రకమైన ఆహ్వానం పలుకుతున్నారు. ‘అన్నీ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఒక సారి హైదరాబాద్‌కు వచ్చి కలవచ్చుగా’ అని కిరణ్ సోదరులు సంతోష్, కిషోర్ మరో వైపు జిల్లా నేతలను సమీకరించుకునే పనిలో పడ్డారు.
 
 కాంగ్రెస్‌కు రారూ.నామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెడితే చూద్దామని కొందరు కాంగ్రెస్ నేతలు ఆయన వెంట నడిచారు. రాజ్యసభ ఎన్నికల విషయంలో ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డితో కిరణ్‌కు చెడింది. అప్పటి వరకు వేచి చూసే ధోరణిలో ఉన్న ఆదాల సైకిలెక్కేందుకు వేగంగా నిర్ణయం తీసుకున్నారు. కిరణ్ పార్టీ పెట్టడానికి భయపడిన వాతావరణం కనిపించడంతో ఆయన వైపు నిలిచిన ఒకరిద్దరు నేతలు కూడా మెల్లగా జారుకున్నారు.
 
 ఉద్యోగులు, విద్యార్థి వర్గాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందనుకున్నా ఆ అంచనాలు కూడా పెద్దగా కనిపించలేదు. జిల్లా అల్లుడైన కిరణ్‌కు ఈ జిల్లా నుంచే అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరక్క పోతే అవమానంగా ఉంటుందనే అంచనాతో కిరణ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యు లు సైతం రంగంలోకి దిగారని తెలిసింది. కిరణ్ సీఎంగా ఉన్న సమయంలో జిల్లా నాయకులతో ఏర్పడిన సంబంధాలు, తమ బంధుత్వాలను కూడా పార్టీ నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు.  
 
 ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మీద కిరణ్ వల విసిరారని సమాచారం. జిల్లాలో తమ పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించాలని వచ్చిన విన్నపాన్ని వాకాటి తిరస్కరించినట్లు తెలిసింది.  వెంకటగిరికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతను తమ పార్టీ నుంచి పోటీ చేయాల్సిందిగా రాయబారం పంపినట్లు వినికిడి. ఈ ప్రతిపాదనపై ఆ నాయకుడు ఏ నిర్ణయం వెల్లడించలేదని తెలిసింది. కావలి నియోజకవర్గం నుంచి మారూ. ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డిని తమ వైపునకు రప్పిం చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఉదయగిరికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరిని కిరణ్ స్వయంగా రాజధానికి ఆహ్వానించారని తెలిసింది. నెల్లూరు సిటీ టికెట్ ఆశిస్తున్న ఆనం జయకుమార్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో కిరణ్‌ను కలి శారు.

ఆయనకు సానుకూల సమాధానం లభించినట్లు తెలిసింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి దేవెళ్ల స్వరూప్‌రెడ్డిని, కోవూరు నుంచి సుమంత్‌రెడ్డిని పోటీ చేయించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ, టీడీపీలో టికెట్లు లభించని వారిలో చాలా మంది మరో ప్రత్యామ్నాయంగా తమ వైపునకు రాకతప్పదనే అంచనాతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
 

మరిన్ని వార్తలు