వెళ్లవయ్యా.. వెళ్లూ..

28 Aug, 2013 05:17 IST|Sakshi

కళ్యాణదుర్గం, న్యూస్‌లైన్ : ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు కళ్యాణదుర్గంలో సమైక్య సెగ తగిలింది. కేశవ్ మంగళవారం కళ్యాణదుర్గం టీ సర్కిల్‌లో జేఏసీ నాయకుల రిలే దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు వచ్చారు. సమైక్యవాదులు ఎదురెళ్లి ‘కేశవ్ గో బ్యాక్’ అంటూ నినదించారు. అర గంట పాటు వేదిక పైకి రాకుండా అడ్డుకున్నారు. స్పష్టమైన వైఖరి ప్రకటించాకే వేదిక మీదకు రావాలని తెగేసి చెప్పారు. వారికి సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే మౌనం వహించి కిందే నిల్చున్నారు. జేఏసీ నాయకుల జోక్యంతో ఆయన వేదికపైకి వెళ్లగా నిరసనలు మిన్నంటాయి. టీడీపీది సమైక్యవాదమా లేక ప్రత్యేక వాదమా తేల్చి చెప్పాలని నిలదీశారు. చంద్రబాబుతో రాజీనామా చేయించి ఉద్యమంలోకి తీసుకురాగలరా అని ప్రశ్నించారు. టీడీపీ రెండు కళ్ల సిద్ధాంతం అవలంబిస్తోందని మండిపడ్డారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి సీమాంధ్రులకు తీరని అన్యాయం చేసిందన్నారు. ఆ లేఖను వెనక్కు తీసుకొని సమైక్యాంధ్రకు మద్దతుగా చంద్రబాబుతో లేఖ ఇప్పిస్తామని ప్రకటించాలని కేశవ్‌ను పట్టుబట్టారు.
 
 వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి వచ్చారని, అదే తరహాలో మీ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు చేయకుండా నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర విభజనకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇచ్చిన అంశంతో కూడిన కరపత్రాలను చూపుతూ నిరసన వ్యక్తం చేశారు. సమైక్యవాదులను సముదాయించేందుకు కేశవ్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేక పోయింది.
 
 ఆయన పక్కనే ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమైక్యవాదులను వారించే ప్రయత్నం చేయగా.. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన ఎస్‌ఐ శ్రీనివాసులు నిరసనకారులను పక్కకు తోసేశారు. ఎమ్మెల్యే కేశవ్ ఏదో చెప్పబోగా.. ‘ఊకదంపుడు ప్రసంగాలొద్దు. స్పష్టమైన వైఖరి చెప్పండి’ అంటూ నిలదీయడంతో చేసేది లేక ఆయన అక్కడి నుంచి నిష్ర్కమించారు. ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకోబోయిన జేఏసీ నాయకుడు పోతుల రాధాకృష్ణను టీడీపీ నాయకులు వారించారు. అనంతరం కేశవ్ మీడియాతో మాట్లాడుతూ జేఏసీ నాయకులెవరూ తనను అడ్డుకోలేదన్నారు.
 
 కాంగ్రెస్ కార్యకర్తలు పథకం ప్రకారం నిరసనలు తెలియజేశారని ఆరోపించారు. అధికారంలో ఉన్న మంత్రి రఘువీరారెడ్డి రాష్ట్ర విభజనపై తన వైఖరిని ప్రకటించలేదని విమర్శించారు. అయితే.. తాను సమైక్యాంధ్ర దీక్షలకు మద్దతు తెలిపేందుకు ముందుకొస్తున్నానన్నారు.
 

మరిన్ని వార్తలు