గ్రామసభల్లో ఇళ్లపట్టాల అర్హుల జాబితా

11 Oct, 2019 09:02 IST|Sakshi
జాయింట్‌ కలెక్టర్‌ మార్కండేయులు

సాక్షి, చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో గ్రామసభలు నిర్వహించి ఇళ్లపట్టాలకు అర్హులైన వారి జాబితాలను ప్రచురించనున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ మార్కండేయులు తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి జిల్లావ్యాప్తంగా ఈనెల 15 వరకు గ్రామసభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇళ్లు లేని వారికి ఇళ్ల పట్టాలను అందజేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు గుర్తించిన అర్హుల జాబితాను గ్రామసభల్లో ప్రచురించనున్నట్లు తెలిపారు. ప్రచురించిన అర్హుల జాబితాలో ఏవైనా పొరపాట్లు, అభ్యంతరాలు, అర్హుల పేర్లు నమోదు కాకపోయినా తెలియజేసేందుకు అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. జిల్లాలోని 1,542 రెవెన్యూ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. తహసీల్దార్, ఎంపీడీవో, ఇతర శాఖల అధికారులతో సభలు నిర్వహించనున్నట్లు చెప్పారు.  

ఇళ్లు లేనివారు లక్ష మంది
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 60 వేలు, పట్టణ ప్రాంతాల్లో 40 వేలు ఇళ్లు లేని వారు ఉంటారని జేసీ తెలిపారు. వారందరికీ ఉగాది నాటికి ఇళ్లపట్టాలు అందజేయనున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని 60 వేల మందిలో 47 వేల మందికి, అర్బన్‌లోని 40 వేల మందిలో 15 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి భూమిని గుర్తించినట్లు తెలివారు. పట్టణ ప్రాంతాల్లో స్థలం కొరత ఉందన్నారు. 570 ఎకరాలు కొనాల్సి ఉంటుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు ఏప్రిల్‌ నుంచి సన్న బియ్యం ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు.  

మరిన్ని వార్తలు