బలోపేతం

2 Apr, 2016 00:26 IST|Sakshi

471 పోస్టులు మంజూరు
జాయింట్ కమిషనర్ పోస్టుకూ గ్రీన్‌సిగ్నల్

మరో రెండు ట్రాఫిక్ స్టేషన్లు, సైబర్ క్రైమ్ స్టేషన్ రాక
పోలీసులపై వత్తిడి తగ్గించేందుకే

 

విజయవాడ : విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌ను బలోపేతం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 2095 మందికి అనదంగా మరో 471 మంది అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది. విజయవాడ రాజధానిగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తి సమయం ఇక్కడే ఉంటున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు వీవీఐపీలు తరచుగా నగరానికి వస్తున్నారు. ప్రధానమైన ప్రభుత్వ శాఖలన్నీ తమ కార్యాలయాలను ఇక్కడే ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని పోలీసు అధికారులు, సిబ్బందిపై  తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. నిఘా కోసం, బందోబస్తు కోసం.. ఉన్న కొద్దిపాటి సిబ్బందిని కేటాయించడం ఉన్నతాధికారులకు తలకు మించిన భారంగా మారింది. వీవీఐపీల తాకిడి ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగింది. నగరంలో అనేక ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. వైట్ కాలర్, సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు సిబ్బందిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 
త్వరలో జోన్ల పునర్‌వ్యవస్థీకరణ

కొత్తగా వచ్చిన పోస్టుల ప్రకారం ప్రస్తుతం ఉన్న నాలుగు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లకు అదనంగా మరో రెండు స్టేషన్లు రానున్నాయి. సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న జోన్‌లను పునర్‌వ్యవస్థీకరిస్తారు. స్పెషల్ బ్రాంచ్, టాస్క్‌ఫోర్స్‌లను బలోపేతం చేస్తారు.

 
కొత్త పోస్టులు ఇవే

ఒక అడిషనల్ కమిషనర్, ఒక జాయింట్ కమిషనర్ , ఇద్దరు డెప్యూటీ కమిషనర్లు, ఒక ఎస్పీ లేదా డెప్యూటీ కమిషనర్, ఇద్దరు  అడిషనల్ ఎస్పీలు, 9 మంది డీఎస్పీలు (ఏసీపీలు), 15 మంది సీఐలు, 27 మంది ఎస్‌ఐలు, 12 మంది ఏఎస్‌ఐలు, 91 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 288 మంది పోలీసు కానిస్టేబుళ్లు ఇప్పుడు ఉన్న సిబ్బందికి అదనంగా రానున్నారు. వీరేకాకుండా ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు, 9 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఒక జూనియర్ స్టెనో, ముగ్గురు డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్లు, ఆరుగురు ఆఫీసు సబార్డినేట్లు (అటెండర్లు) రానున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న అధికారులు, సిబ్బంది కొంత ఊపిరి పీల్చుకునేందుకు వీలుంటుందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి

 

సిటీ సెక్యూరిటీ వింగ్‌కు గ్రీన్‌సిగ్నల్
583 మంది సిబ్బందితో ఏర్పాటు
విజయవాడ నగర కమిషనరేట్ పరిధిలో 583 మంది సిబ్బందితో సిటీ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. డెప్యూటీ కమిషనర్ కేడర్ అధికారి దీనికి నేతృత్వం వహిస్తారు. ఈ వింగ్‌లో ఒక డీసీపీ, ఒక ఏడీసీపీ, నలుగురు సీఐలు, 41 మంది ఎస్సైలు, 11 మంది ఏఎస్సైలు, 40 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 345 మంది కానిస్టేబుళ్లు, 79 మంది పోలీస్ డ్రైవర్లు, 30 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించనున్నారు. కార్యాలయంలో విధుల కోసం చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఒకరు, సూపరిటెండెంట్లు ఇద్దరు, సీనియర్ అసిస్టెంట్లు ఇద్దరు, జూనియర్ అసిస్టెంట్లు ఇద్దరు, ఇంటెలిజెన్స్ విభాగం మేనేజర్ ఒకరు, అసిస్టెంట్ మేనేజర్లు ముగ్గురు, ఐడీ అసిస్టెంట్లు ముగ్గురు, డీటీపీ ఆపరేటర్లు ఇద్దరు, ఆఫీస్ సబార్డినేట్లు ఇద్దరు, అవుట్ సోర్సింగ్ స్వీపర్లు 10 మందిని నియమించుకోవటానికి అనుమతి ఇచ్చారు.

 

>
మరిన్ని వార్తలు