ఉమ్మడి రాష్ట్రంలోనే కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలి

10 May, 2014 00:30 IST|Sakshi

బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
 రాష్ట్ర అధ్యక్షుడు వి. సత్యమూర్తి

 
 హైదరాబాద్,  ఉమ్మడి రాష్ర్టంలో చేసిన పనులకు రాష్ర్టం కలసి ఉన్న సమయంలోనే బిల్లులు చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు వి. సత్యమూర్తి కోరారు. విభజన నేపథ్యంలో ఆరు నెలలుగా తాము పూర్తి చేసిన ప్రభుత్వ పనులకు గానూ సుమారు రూ. 1500 కోట్లు రావాల్సి ఉన్నా.. ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. ఈ బిల్లులను ఈ నెల 24లోపు చెల్లించే విధంగా గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్టర్స్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ సచ్చిదానందరెడ్డి, సోమ శ్రీనివాస్‌రెడ్డిలతో కలసి శుక్రవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఆర్ అండ్ బీలో రూ. 540 కోట్లు, ప్రాణహిత- చేవెళ్ల పనులకు గాను రూ. 500 కోట్లు పంచాయతీ రాజ్ శాఖ నుంచి పూర్తి చేసిన పనులకు గాను రూ. 500 కోట్లు పలువురు కాంట్రాక్టర్లకు కావాల్సి ఉన్నా వాటిని మంజూరు చేయడంలో అధికారులు తాత్సారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుపెట్టుకొని పూర్తయిన పనుల బిల్లులు పే అండ్ అకౌంట్స్ కార్యాలయానికి వచ్చినా చెల్లింపులు చేయడం లేదన్నారు. తమ సమస్యను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
 
 

మరిన్ని వార్తలు