ప్రతిపాదనలు గోదారంత.. కేటాయింపులు కాలువంత...

9 Aug, 2014 00:55 IST|Sakshi

ఆదిలోనే నీళ్లు

వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలు.. ఉభయగోదావరి జిల్లాలకు మహాసంరంభమేనన్న అంచనా ‘నీటిబుడగే’ అనిపిస్తోంది. రానున్నది మహా పుష్కరమనీ, కుంభమేళాగా నిర్వహిస్తామని  ఇటీవలే గొప్పగా చెప్పారు ప్రజాప్రతినిధులు. ఈ నేపథ్యంలో వచ్చే ఏటి పుష్కరాలకు గత పుష్కరాల కన్నా రెట్టింపు మంది సందర్శకులు వస్తారని భారీ అంచనాలు సిద్ధం చేశారు అధికారులు. అయితే వాటిపై ఆదిలోనే ప్రభుత్వం నీళ్లు జల్లింది.
 
సాక్షి, రాజమండ్రి :  పుష్కరాలకు టోకెన్ గ్రాంటుగా రూ.100 కోట్లు మాత్రమే కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం సదుపాయాలకు మాత్రమే చేసే ఖర్చులకు అదనంగా మరో రూ.వంద కోట్లయినా ఇస్తాము తప్ప ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు పైసా ఇచ్చేది లేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం రాజమండ్రిలో చెప్పారు. దీంతో అవాక్కవడం - అధికారుల వంతైంది. ‘12 ఏళ్ల క్రితమే రూ.వంద కోట్లు వెచ్చించారు. ఈ వ్యవధిలో అన్నింటి ధరలూ పదిరెట్లు పెరిగాయి.
 
ఈ పుష్కరాలకు రెట్టింపు యాత్రికులు వస్తారంటున్నదీ ప్రభుత్వమే. అలాంటప్పుడు ఆ వంద కోట్లు ఎలా సరిపోతాయి?’ అని గుంజాటన పడడమే వారి వంతైంది. పుష్కరాలకు కనీసం రూ.500 కోట్లయినా అవసరమని ఈ నెల 3న జరిగిన అధికారుల సమావేశంలో దేవాదాయశాఖ  మంత్రి మాణిక్యాలరావు స్వయంగా అన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పాట్లు ఘనంగా చేస్తామంటూనే నిధులను పరిమితం చేస్తోంది.
 
ఆర్థిక మంత్రి యనమల అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల కమిటీ శుక్రవారం రాజమండ్రి ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైంది. పుష్కర నిధులకు ఆకాశమే హద్దన్న నోటితోనే యనమల వెంటనే పుష్కరాలకు టోకెన్ గ్రాంటుగా వంద కోట్లు మాత్రమే విడుదల చేస్తున్నట్టు ప్రకటించడం అందరినీ విస్మయపరిచింది. రెండు జిల్లాల్లోని వివిధ శాఖల అధికారులు..  పుష్కరాలతో గోదావరి తీర ప్రాంతాల అభివృద్ధికి దోహదపడాలన్న భావనతో రూ.1100 కోట్ల మేర ప్రతిపాదనలను రూపొందించి మంత్రుల కమిటీకి అందించారు.
 
అయితే ‘నిధులు ఎంతైనా ఇస్తాం, పనులు పుష్కర యాత్రికులకు సదుపాయాలు కల్పించేవి మాత్రమే అయి ఉండాలి’ అంటూ ఆర్థిక మంత్రి నిబంధన పెట్టారు.
 
కేంద్రం ఇస్తే మరింత ఖర్చు చేయగలం..

‘గత పుష్కరాలకు ఉమ్మడి రాష్ట్రంలో రూ.100 కోట్లు వెచ్చించాం. రూ.50 కోట్లు కేవలం రాజమండ్రిలోనే ఖర్చు చేశాం. ఈసారి నిధుల కొరత ఉంది. అయినా ఖర్చుకు వెనుకాడం. కేంద్రం నుంచి అదనపు నిధులు వస్తే మరింత ఎక్కువ ఖర్చు చేయగలం. గతంలో కేంద్రం పెద్దగా సహకారం అందించలేదు. ప్రముఖ దేవాలయాల ఆదాయం పుష్కరాల్లో భారీగా పెరుగుతుంది. అందువల్ల ఆలయాల అభివృద్ధికి వారి నిధులనే వెచ్చించాలి.
 
పరిసరాల్లోని చిన్న ఆలయాల అభివృద్ధి వ్యయం కూడా అవే భరించాలి. ఇరిగేషన్ అధికారులు ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే డిమాండ్‌ల ఆధారంగా కాక అవసరాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఘాట్‌ల నిర్మాణం, పునర్నిర్మాణం చేయాలి. ప్రతిపాదనలు పుష్కరాలకు వర్తించేవా, కాదా అని కలెక్టర్లు పరిశీలించాకే నిధులు వస్తాయి’.. ఆర్థిక మంత్రి యనమల అధికారులకు చేసిన కర్తవ్యబోధ ఇది. కాగా ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, దేవాదాయ తదితర శాఖల నుంచి, రాజమండ్రి నగరపాలక సంస్థ నుంచి ప్రతిపాదనలను కమిటీ స్వీకరించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సూచనలు తెలుసుకుంది. పుష్కరాలు శుభంగా జరగాలన్న సంకల్పంతో.. వేద పండితుల మంత్రపఠనంతో  సమావేశం ప్రారంభించారు.

తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్లు నామన రాంబాబు, ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్సీలు చైతన్యరాజు, రవికిరణ్ వర్మ, బలసాలి ఇందిర, లక్ష్మీ శివకుమారి, తూర్పుగోదావరి ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, చిర్ల జగ్గిరెడ్డి, వనమాడి వెంకటేశ్వర రావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ, పి.నారాయణమూర్తి, అయితాబత్తుల ఆనందరావు, దాట్ల సుబ్బరాజు, తోట త్రిమూర్తులు, గొల్లపల్లి సూర్యారావు, పశ్చిమగోదావరి ఎమ్మెల్యేలు  కె.ఎస్.జవహర్, బూరుగుపల్లి శేషారావు, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, బండారు మాధవరాయుడు, ముప్పిడి వెంకటేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, ఏజేసీ మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు.
 
పుష్కరాల్లో యాత్రికుల సౌకర్యం కోసం ఎన్‌టీఆర్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. ఎమ్మెల్సీ చైతన్యరాజు ఉచిత భోజనసదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. యాత్రికులకు అన్నదానం చేసే వారి వివరాలు, చేసే స్థలాలు ముందుగానే రిజిస్టరు చేసుకోవాలి.
 - నిమ్మకాయల చినరాజప్ప, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి
 
అన్ని శాఖల అధికారులకు ఎవరు ఏం చేయాలో నిర్దేశించాం. గతం కంటే ఘనంగా పుష్కరాలు ఉంటాయి. అధికారుల ప్రతిపాదనలు తుది రూపు దాల్చి, కమిటీ ముందుకు వచ్చాక తుది కార్యాచరణ ఉంటుంది.
 - పి.నారాయణ, పట్టణాభివృద్ధి శాఖ  మంత్రి
 
రాజమండ్రిలోరూ.4 కోట్లతో పర్యాటక శాఖ కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తుంది. అది ఈసారి పుష్కరాలకు గుర్తుగా ఉండిపోతుంది. వీఐపీ, వీవీఐపీ భక్తుల కోసం కొవ్వూరు, రాజమండ్రిల్లో  కొత్త ఘాట్లు నిర్మిస్తాం.
 -  పైడికొండల మాణిక్యాలరావు, దేవాదాయ శాఖ  మంత్రి
 
 మహిళా యాత్రికులకు ప్రత్యేక సదుపాయాలు ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేయాలి. వారి భద్రతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది.
 - పీతల సుజాత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి
 
  పుష్కరాలకు ప్రధానవేదికైన రాజమండ్రిలో వద్ద గోదావరి కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలి. భక్తులకు సదుపాయాల కోసం నగరపాలక సంస్థ అంచనా వేసిన రూ.270 కోట్లు మంజూరు చేయాలి.
 - పంతం రజనీ శేషసాయి, మేయర్, రాజమండ్రి
 
భక్తులు ఇబ్బంది లేకుండా నదీస్నానాలు చేసి, ఆలయ దర్శనం చేయగలిగితే పుష్కరాలు విజయవంతం అయినట్టే. మహిళలకు స్నాన ఘట్టాల దుస్తుల వూర్పిడికి వసతులు మెరుగు పరచాలి. రాజమండ్రిలో కోటిలింగాల రేవు నుంచి గోదావరి రోడ్డుతో పాటు నగరంలోని అన్న ఇరుకు రోడ్లలో ఆక్రమణలు తొలగించి వెడల్పు చేయాలి. ఖాళీ స్థలాల్లో భారీ టెంట్‌లు వేసి ప్రయాణికులకు విశ్రాంతి సదుపాయం కలగచేయాలి. - ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్సీ, రాజమండ్రి
 
జిల్లాలో చారిత్రక ప్రసిద్ధి గాంచిన దేవాలయాలు చాలా ఉన్నాయి. పుష్కరాల సందర్భంగా వాటిని తీర్చిదిద్దాలి. అందుకు సరిపడా నిధులు కేటాయించాలి.
 - జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట ఎమ్మెల్యే
 
పుష్కరాల్లో పితృదేవతలకు పిండప్రదాన కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయి. అందుకోసం వచ్చే భక్తులకు రవాణా, వసతి, భోజన సదుపాయాలు కల్పించేందుకు ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఈ కార్యక్రమాలకు సామగ్రి కూడా ప్రభుత్వమే అందించాలి.
 - ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్యే, రాజమండ్రి సిటీ
 
అధికారులు దీర్ఘకాలిక, స్వల్పకాలిక పనుల ప్రణాళికలు రూపొందించుకోవాలి. వాటిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమివ్వాలి.  
 - నీతూ కుమారి ప్రసాద్, కలెక్టర్, తూర్పుగోదావరి
 
అన్ని శాఖల అధికారులతో సవిరంగా చర్చిస్తాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రణాళికలు రూపొందిస్తాం.
 - కాటమనేని భాస్కర్, కలెక్టర్, పశ్చిమగోదావరి

మరిన్ని వార్తలు