భాషా పండితులు, పీఈటీలు.. ఇక స్కూల్‌ అసిస్టెంట్లు!

4 Nov, 2019 05:03 IST|Sakshi

దశాబ్దాల కలను సాకరం చేసిన ప్రభుత్వం   

పదోన్నతుల ఉత్తర్వుల అమలుపై జీవో నం.77 విడుదల

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు(పీఈటీ) ఏళ్ల తరబడి సాగిస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. పదోన్నతులు, సమాన పనికి సమాన వేతనం కోసం ఎదురు చూసిన వేలాది మంది పండితులు, పీఈటీల కల నెరవేరింది. స్కూల్‌ అసిస్టెంట్లుగా ఉన్నతీకరణ అయిన భాషా పండితులు, పీఈటీ పోస్టుల్లోకి భాషా పండితులు, వ్యాయమ ఉపాధ్యాయులకు పదోన్నతులకు అవకాశం కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ గతంలో ఉత్తర్వులు జారీచేయగా, వాటి అమలుపై జీవో నం.77 ఇచ్చారు. ఈ ఉత్తర్వులతో రాష్ట్రంలోని 12,827 మంది భాషా పండితులు, పీఈటీలలో అత్యధికులకు ప్రయోజనం చేకూరనుంది.  

1983లో పోస్టుల అప్‌గ్రేడేషన్‌ ఉత్తర్వులు జారీ అయినప్పటినుంచి భాషా పండితులు, పీఈటీల పోరాటం కొనసాగుతూనే ఉంది. తమ పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. గతేడాది డిసెంబర్‌ 17న 10,224 భాషా పండితులు, 2,603 పీఈటీల పోస్టులను ఉన్నతీకరిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో నం.91 విడుదల చేసింది. కానీ, సాకులు చెబుతూ ఆ జీవోను అమలు చేయలేదు. వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టాక వీరి సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎస్‌ఏలుగా ఉన్నతీకరణ అయిన పండిత, పీఈటీ పోస్టుల్లోకి భాషాపండితుల, పీఈటీలకు పదోన్నతులు కల్పించింది. అర్హతలుండే సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు సైతం అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చి, వారికి న్యాయం చేకూర్చింది.

భాషా పండితులు, పీఈటీల కుటుంబాల్లో ఆనందం  
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి, భాషా పండితులు, పీఈటీల సమస్య తీవ్రతను వివరించగానే, వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. ఉన్నతీకరణ ఉత్తర్వులు విడుదల చేయడమే కాకుండా కౌన్సెలింగ్‌ను  ఏర్పాటుచేసి భాషా పండితులు, పీఈటీ కుటుంబాల్లో ఆనందాన్ని నింపారన్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులురెడ్డి, యస్‌.యల్‌.టి.ఎ. వ్యవస్థాపక అధ్యక్షుడు సిద్ధయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా