జిల్లాపై కపట ప్రేమ

22 Jul, 2018 10:57 IST|Sakshi

నీటి పారుదల రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు 

హంద్రీ–నీవా నీటి కేటాయింపులో తీరని అన్యాయం 

చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గౌరు చరిత, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి ధ్వజం 

‘అనంత’కు 20 టీఎంసీల నీటి తరలింపు సర్వే ఆపాలని డిమాండ్‌ 

 తాగునీటి సమస్యపై గళమెత్తిన మెజారిటీ సభ్యులు 

 వాడీవేడిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం 

 ఐదు శాఖలపైనే చర్చ 

కర్నూలు(అర్బన్‌): ‘ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లాపై కపట ప్రేమ చూపిస్తున్నారు. నీటి పారుదల విషయంలో అనంతపురం జిల్లాపైనే అమితమైన ప్రేమ కనబరుస్తున్నారు. దీనివల్ల జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. పక్కనే హంద్రీ–నీవా నీరు పోతున్నా, మన జిల్లాకు ఏడు టీఎంసీలు, అనంతపురం జిల్లాకు మాత్రం 40 టీఎంసీలు కేటాయించారు. ఇదేమి న్యాయం?’ అని వైఎస్సార్‌సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి నిలదీశారు. చేసిన అన్యాయం చాలక.. తాజాగా నందవరం మండలం నాగులదిన్నె నుంచి 20 టీఎంసీల తుంగభద్ర నీటిని అనంతపురం జిల్లాకు తరలించేందుకు సర్వే జరుగుతోందని, దీన్ని వెంటనే ఆపకపోతే భవిష్యత్తులో కర్నూలు తీవ్ర తాగు, సాగునీటి కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

అనంతపురానికి నీటిని తరలించేందుకు జారీ చేసిన జీఓ 277ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై జెడ్పీ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని సభ్యులు కూడా మూకుమ్మడిగా డిమాండ్‌ చేశారు. అయినా చివరకు దీనిపై తీర్మానం చేయకపోవడం శోచనీయం. శనివారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ భవనంలో జెడ్పీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌ అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీలు గంగుల ప్రభాకర్‌రెడ్డి, వెన్నపూస గోపాల్‌రెడ్డి, కత్తి నరసింహారెడ్డి, కేఈ ప్రభాకర్, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, మణిగాంధీ, కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ, జెడ్పీ సీఈఓ ఎం.విశ్వేశ్వరనాయుడుతో పాటు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు.  

గుండ్రేవుల నిర్మాణం చేపట్టాలి: ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి 
సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా గుండ్రేవుల రిజర్వాయర్‌ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని  ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి డిమాండ్‌ చేశారు. సర్వేలంటూ కాలక్షేపం చేస్తున్నారే తప్ప ఇంతవరకు ఈ నిర్మాణానికి నయాపైసా విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీ కెనాల్‌ పూర్తిగా దెబ్బతిన్నా పట్టించుకునే వారే లేరన్నారు. శ్రీశైలం జలాశయం నీటి మట్టం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో దీనిపరిధిలోని రిజర్వాయర్లు, పంట కాలువలకు నీటిని ఎప్పుడు విడుదల చేస్తారో అధికారులు ముందుగానే రైతాంగానికి తెలియజేయాలని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి కోరారు. కేసీ కెనాల్‌కు విడుదల చేసే తుంగభద్ర నీరు నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాలకు చేరే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఈఎన్‌సీకి పోతిరెడ్డిపాడు పనులు చూసేందుకే సమయం సరిపోతున్నందున రాయలసీమకు అదనంగా ఈఎన్‌సీని నియమించాలన్నారు. 

తాగునీటిపై గళం 
కోడుమూరు మండలంలోని అనేక గ్రామాలు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయని ఎంపీపీ రఘునాథరెడ్డి తెలిపారు. వెంటనే శాశ్వత పరిష్కారాన్ని చూపాలన్నారు. ప్యాపిలిలో 20 రోజుల నుంచి నీరు రావడం లేదని ఎంపీపీ సరస్వతి వాపోయారు. కౌతాళంలో తాగునీరు కలుషితమైందని జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మి, ఆస్పరి మండలం జోహరాపురంలో నీటి సమస్య కారణంగా వక్కిరేణికుంటపై ఆధారపడాల్సి వస్తోందని ఆ మండల జెడ్పీటీసీ సభ్యురాలు బొజ్జమ్మ సమావేశం దృష్టికి తెచ్చారు. 

ఐదు శాఖలపైనే చర్చ  
అజెండా ప్రకారం ఎనిమిది శాఖలపై చర్చ జరగాల్సి ఉండగా, కేవలం ఐదింటితోనే సరిపెట్టడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయం, నీటి పారుదల, గ్రామీణ నీటి సరఫరా – పారిశుద్ధ్యం, విద్యుత్, గృహ నిర్మాణం, పశు సంవర్ధకం, ప్రజా పంపిణీ, విద్యా శాఖలపై చర్చ సాగుతుందని ముందుగా అజెండా రూపొందించారు. అయితే.. గృహ నిర్మాణం, పశు సంవర్ధకం, ప్రజా పంపిణీ గురించి ఏ మాత్రమూ చర్చించ లేదు. విద్యుత్‌పై కూడా ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి కలుగజేసుకోవడంతో కొంత సేపు చర్చ సాగింది. కాగా.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై  కేడీసీసీ బ్యాంక్‌ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి  అసంబద్ధ వ్యాఖ్యలు చేయడంతో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరిత తదితరులు కేడీసీసీబీ అధ్యక్షుడి తీరును నిరసిస్తూ సమావేశంలోనే బైఠాయించారు.

సభ్యులు ప్రస్తావించిన సమస్యలివీ.. 
► మార్క్‌ఫెడ్‌ ద్వారా రైతుల నుంచి కొన్న కందులకు డబ్బు ఎప్పుడు చెల్లిస్తారని  ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రశ్నించారు. కలెక్టర్‌ స్పందిస్తూ 45 వేల మెట్రిక్‌ టన్నులను కొన్నామని, ఇప్పటికే రూ.265 కోట్లు చెల్లించామని, ఇంకా రూ.60 కోట్లను చెల్లించాల్సి ఉందని చెప్పారు.
 
► తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బేషరతుగా రైతులు, చేనేత కార్మికులు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామన్నారని, ఎంత మంది రైతులకు రుణాలను మాఫీ చేసి.. బ్యాంకుల్లో ఉన్న వారి బంగారు ఆభరణాలు, డాక్యుమెంట్లను తిరిగి ఇప్పించారని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ప్రశ్నించారు.  

► ప్రొద్దుటూరు నుంచి చాగలమర్రి వరకు గతంలో ఉన్న విద్యుత్‌ లైన్‌ బ్రేక్‌ డౌన్‌ అయ్యిందని, దాన్ని పునరుద్ధరిస్తే భవిష్యత్‌లో ఉపయోగం ఉంటుందని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి సూచించారు.  

► ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు పంపిన రూ.35 కోట్ల ప్రతిపాదనలు ఏమయ్యాయని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రశ్నించారు. వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ కింద ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.  

► రైతురథం ట్రాక్టర్లు టీడీపీ వారికే దక్కాయని డోన్‌ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు ఆరోపించారు. అర్హులైన రైతులకు ట్రాక్టర్లు ఇవ్వలేదని, కాంట్రాక్టర్లు, వ్యాపారులకు ఇచ్చారని ఆయన దుయ్యబట్టారు.  

► నాగులదిన్నె నుంచి అనంతపురానికి నీటిని తీసుకెళ్తే జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పుష్పావతి ఆందోళన వ్యక్తం చేశారు.  

► బెళగల్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పైకప్పు పెచ్చులూడిపోయి కూలేందుకు సిద్ధంగా ఉందని, పాముల సంచారం కూడా అధికంగా ఉందని జెడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్‌ తెలిపారు. 

► ప్యాపిలిలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జెడ్పీటీసీ సభ్యుడు దిలీప్‌ చక్రవర్తి డిమాండ్‌ చేశారు. 

► కౌతాళం కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మి తెలిపారు. అలాగే గ్రామంలోని నీటి ట్యాంకులను శుభ్రం చేయడం లేదన్నారు. 

మరిన్ని వార్తలు