ఓటే వజ్రాయుధం... భవితకు సోపానం...

26 Jan, 2019 08:25 IST|Sakshi
ర్యాలీలో పాల్గొన్న అధికారులు

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్‌

విజయనగరంలో ఘనంగా ఓటర్ల దినోత్సవం ఉత్తమ అధికారులకు ప్రశంసాపత్రాలు

సీనియర్‌ ఓటర్లకు సన్మానం

విజయనగరం గంటస్తంభం: బంగారు భవితకు ఓటే వజ్రాయుధం వంటిదనీ, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని ఎన్నికల్లో వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్‌ అన్నారు. మహారాజా అటానమస్‌ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసి న ఓటర్ల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ డబ్బు, మద్యం, మతం, కులం పే రుతో ఓటర్లను ప్రలోభపెట్టడం నేరమని, డబ్బు, మద్యం ఇచ్చినవారు, తీసుకున్నవారు శిక్షార్హులే న ని అన్నారు. ఎన్నికల్లో మంచి నాయకుడిని ఎన్నుకోవాలని, పోటీ చేసే వారు ఎవరూ నచ్చకపోతే నోటా ఆప్షన్‌ ఉపయోగించుకోవాలని సూచించా రు.

ఎన్నికలలో కొందరు పోటీ చేసేవారు లక్షలు, కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి గెలిచి మరలా అక్రమార్జన ద్వారా సంపాదిస్తున్నారని, అటువంటి వారికి ఓట్లు వేయకూడదని సూచించారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం హరిజవహర్‌ లాల్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటుకు అత్యంత ప్రాధాన్యం ఉందని, ఎవరి ప్రలోభాలకూ లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేయాలన్నారు. ఓటు హక్కు పొందిన అందరూ తమ ఓటును వినియోగించుకోవాలని, ఓటర్ల నమోదుపై అవగాహన కలిగించాలన్నారు. నిబద్ధత కలిగిన, నిస్వార్ధమైన, నిజాయితీగల నాయకులను ఎన్నుకోవాలని సూచించారు.

ర్యాలీతో ప్రారంభం
అంతకుముందు ఉత్సవాలు ర్యాలీతో ప్రారంభమయ్యాయి. కోట జంక్షన్‌ వద్ద ఏర్పాటుచేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఓటుకు సంబంధించిన నినాదాలతో ఎం ఆర్‌ కళాశాల వరకు ర్యాలీ కొనసాగింది. గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి, విగ్రహం చుట్టూ మానవహారంగా ఏర్పడ్డారు. కార్యక్రమంలో ఎన్నికల విధుల్లో ఉత్తమ సేవలు అందించిన ఈఆర్‌ఓలు, ఏపీఆర్‌ఓ లు, బీఎల్‌వోలకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందించారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులకు, టూకే రన్‌ లో విజేతలైన వారికి బహుమతులను అందజేశారు. కొత్ట ఓటర్లకు ఓటుహక్కు కార్డులను అందజేశారు. వృద్ధ, థర్డ్‌జెండర్, నూతన ఓటర్లను సత్కరించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ కె.వెంకటరమణా రెడ్డి, జేసీ–2 జె.సీతారామారావు, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, పీటీసీ ప్రిన్సిపల్‌ మెహర్‌ బాబు, అధికారులు, సిబ్బంది, పలువురు ఓటర్లు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు