జూన్ 2 నుంచి అంగన్‌వాడీలకు సన్నబియ్యం!

20 Mar, 2015 01:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇప్పటికే 2,695 హాస్టళ్లు, 27,865 పాఠశాలలకు ప్రతినెలా 20,389 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరా చే స్తున్న ప్రభుత్వం జూన్ 2 నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా చేయాలని యోచిస్తోంది.

అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన బియ్యం, ఆర్థిక భారం, అంచనాలను సిద్ధం చేయాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖలో కదలిక మొదలైంది. ఈ మేరకు అంగన్‌వాడీల సమగ్ర వివరాలు తమకు అందివ్వాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖను కోరింది. ప్రాథమికంగా అందించిన సమాచారం మేరకు రాష్ట్రంలోని 35 వేల అంగన్‌వాడీ కేంద్రాలకు ఏటా సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. దీని స్థానంలో ఇప్పుడు సన్నబియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం సంకల్పించినందున ప్రభుత్వంపై అదనంగా రూ.50 కోట్ల మేర భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు