సెలవుల్లేవ్‌

26 Apr, 2018 07:02 IST|Sakshi

వేసవిలో సీనియర్‌ ఇంటర్‌ తరగతులు  నిర్వహిస్తున్న కార్పొరేట్‌ యాజమాన్యాలు

ప్రేక్షక పాత్ర వహిస్తున్న ఇంటర్‌ బోర్డు అధికారులు

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులకు జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలలు అప్పడే సీనియర్‌ ఇంటర్‌ తరగతులను ప్రారంభించేశాయి. వేసవి సెలవుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహించరాదన్న బోర్డు ఉత్తర్వులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. వేసవి సెలవులను సరదాగా గడపాల్సిన సమయంలో ద్వితీయ సంవత్సర సిలబస్‌తో తరగతులను మొదలెట్టాయి. సప్లిమెంటరీ పరీక్షల పేరుతో యథేచ్ఛగా క్లాసులు నిర్వహిస్తున్నాయి.

పరీక్షల హడావుడితో అలసిన విద్యార్థులు
ఏడాది పొడవునా తరగతి గదులకు పరిమితమైన విద్యార్థులకు మానసిక విశ్రాంతి తప్పనిసరి. సెలవుల్లో వారు కొంత సేద తీరి ఊపిరి పీల్చుకుంటారు. సీనియర్‌ ఇంటర్‌ తరగతులతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలలు డే స్కాలర్‌తోపాటు హాస్టల్‌ క్యాంపస్‌లలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాయి. గుంటూరు నగరంలోని చంద్రమౌళీనగర్‌తోపాటు శివారు గోరంట్ల, రెడ్డిపాలెం, పెద పలకలూరులో ఉన్న హాస్టళ్లలో యథేచ్ఛగా తరగతులు కొనసాగుతున్నాయి. 

కళాశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తాం
వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించరాదని కళాశాలల యాజమాన్యాలను స్పష్టంగా చెప్పాం. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న విషయమై విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై త్వరలోనే యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తాం. నిబంధనలు పాటించని యాజమాన్యాల తీరును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం.

మరిన్ని వార్తలు