వైద్యసేవలపై సమ్మెట

9 Mar, 2018 10:42 IST|Sakshi
కేజీహెచ్‌లో ధర్నా చేస్తున్న జూనియర్‌ వైద్యులు

సమ్మెకు దిగిన జూనియర్‌ డాక్టర్లు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందక రోగుల ఇక్కట్లు

అత్యవసర సేవలకు మినహాయింపు

రేపటిలోగా ప్రభుత్వం దిగిరాకపోతే అన్ని సేవలూ బంద్‌

పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ జూనియర్‌ డాక్టర్లు గురువారం సమ్మెకు దిగారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందలేదు. ముఖ్యంగా కేజీహెచ్‌లో వైద్య సేవలు అందక రోగులు నానా పాట్లు పడ్డారు. వివిధ ఓపీల్లో వైద్యుల కోసం ఎదురుచూశారు. పలు విభాగాల వద్ద రోగులు బారులు తీరారు. చికిత్స కోసం నానా హైరానా పడాల్సి వచ్చింది. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. శనివారం లోపల ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే అత్యవసర సేవలకూ దూరంగా ఉంటామని జూడాలు స్పష్టం చేశారు.

డిమాండ్లు పరిష్కరించే వరకూనిరవధిక సమ్మె
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకూ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె కొనసాగిస్తామని ఏపీ జూనియర్‌ వైద్యుల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. గురువారం కేజీహెచ్‌ ప్రధాన ద్వారం వద్ద నిరవధిక సమ్మెకు దిగిన జూనియర్‌ వైద్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత నెల 14న సమ్మెకు పిలుపునిచ్చామని, చర్చిలకు పిలిచిన ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, రోజులు గడుస్తున్నా పరిష్కారానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో సమ్మెకు దిగామని చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్న ఉపకార వేతనాలను 15 శాతం పెంచామని, బకాయి పడ్డ ఉపకార వేతనాలను వెంటనే చెల్లిస్తామని చెబుతూ ప్రభుత్వం దొంగ జీవో విడుదల చేసిందని సంఘం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2009లో పెంచిన ఉపకార వేతనాన్నే ఇప్పటీకీ చెల్లిస్తున్నారని, 2018లో పెంచాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. 2016–17లో బకాయి ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 2010–11 విద్యా సంవత్సరంలో ప్రవేశం పొందిన ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఇప్పటికీ ఒరిజినల్‌ సర్టిఫికెట్లను ఇవ్వకపోవడం దారుణమన్నారు.

అత్యవసర సేవలకు ప్రత్యేక టీం
ప్రస్తుతం ఔట్‌ పేషెంట్, వార్డుల్లో రోగులకు సేవలను నిలిపివేశామని, అత్యవసర కేసులను చూసేందుకు ప్రత్యేకం టీంను సిద్ధం చేశామని జూడాలు తెలిపారు. పీజీ పూర్తి చేసిన తరువాత ఏడాది పాటు ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుని మరుసటి ఏడాది రిజిస్ట్రేషన్‌ చేస్తుందని, ఆ తరువాత మరో ఏడాది పనిచేస్తే సీనియర్‌ రెసిడెంట్స్‌గా గుర్తింపు ఇస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, వైద్య విద్యా సంచాలక శాఖ ఇలా సీనియర్‌ రెసిడెంట్స్‌ పేరిట విద్యార్థులను మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్‌ రెసిడెంట్స్‌కు పీజీ పూర్తి చేసిన రెండు నెలల్లో నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే డిమాండ్ల పరిష్కారానికి దిగిరాకపోతే శనివారం నుంచి అత్యవసర సేవలను కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు. ప్రజారోగ్యానికి భంగం కలిగితే అందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని జూనియర్‌ వైద్యులు స్పష్టం చేశారు. ప్రజలు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేజీహెచ్‌లో సుమారు 400 మంది జూనియర్‌ వైద్యులు ర్యాలీ నిర్వహించారు.

హక్కులతో పాటుబాధ్యతలూ గుర్తించాలి
హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించాలి. జూనియర్‌ వైద్యులకు జనవరి నెల వరకూ ఉపకార వేతనాలు చెల్లించాం. 15 శాతం పెరిగిన ఉపకార వేతనాలతో పాటు బకాయిలకు సంబంధించి అవసరమైన జీవో విడుదల కాలేదు. మరో వారం రోజుల్లో ఈ జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. జూనియర్‌ వైద్యులు వారం, పదిరోజుల పాటు సంయమనం పాటిస్తే బాగుంటుంది. ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేస్తే బకాయిలు చెల్లించవచ్చు. సమ్మె కారణంగా ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం.
– డాక్టర్‌ పి.వి.సుధాకర్, ప్రిన్సిపాల్, ఆంధ్ర వైద్య కళాశాల

మరిన్ని వార్తలు