విధి చేతిలో ఓడిన యువకుడు

7 Oct, 2019 10:33 IST|Sakshi

సాక్షి, పాలకొండ : విధుల్లో చేరిన కొద్ది రోజుల్లోనే ఆ యువకుడు విధి చేతిలో ఓడిపోయాడు. ఆ కుటుంబ ఇంకా ఆనందం నుంచి తేరుకోక ముందే తీవ్ర విషాదం నెలకొంది. పేద కుటుంబంలో పుట్టిన ఆ యువకుడు తల్లిదండ్రులకు చేదోడుగా ఉండేవాడు. ప్రతి ఒక్కరికి సహాయం అందించే వ్యక్తి రెప్పపాటులో విగతజీవిగా మారడంతో గ్రామంలో విషాదం అలముకుంది. మండలంలోని నవగాం గ్రామానికి చెందిన బెహరా రమేష్‌ (35) గ్రామంలో ఒప్పంద పద్ధతిలో విద్యుత్‌ శాఖలో షిఫ్ట్‌ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన సచివాలయ ఉద్యోగాల నియమాకంలో జూనియర్‌ లైన్‌మన్‌గా ఉద్యోగం పొందాడు.

వంగర మండలంలో ఇటీవల విధుల్లో చేరాడు. ఆదివారం సెలవు కావడంతో ఇంటిలోనే ఉన్నాడు. మధ్యాహ్న సమయంలో పక్క ఇంటిలో విద్యుత్‌ రావడం లేదని పిలవడంతో పరిశీలించడానికి వెళ్లాడు. ఈ సమయంలో విద్యుత్‌ బోర్డు తగిలి షాక్‌కు గురయ్యాడు. వెంటనే స్థానికులు పాలకొండ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు రమేష్‌ను పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఉషారాణి, ఎనిమిది నెలల పాప, తల్లిదండ్రులు ఉన్నారు.  

రమేష్‌ గ్రామంలో అందరికీ అందుబాటులో ఉండేవాడని, ఎవరి ఇంటిలో విద్యుత్‌ సమస్య వచ్చినా తక్షణం స్పందించేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. డబ్బులు కూడా తీసుకోకుండా సాయం అందించేవాడన్నారు. భర్త మృతిచెందిన విషయం తెలుసుకున్న భార్య ఉషారాణి బోరున విలపించింది. ఉద్యోగం వచ్చిన ఆనందం ఎన్నో రోజులు నిలవలేదని తమకు ఇక దిక్కెవరంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదించారు.  

మరిన్ని వార్తలు