ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ బోసలే

30 Apr, 2015 01:43 IST|Sakshi
ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ బోసలే

- నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
- మే 7న బాధ్యతల స్వీకరణ


 హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ బోసలే నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మే ఏడున ఆయన బాధ్యతలు చేపడతారు. గవర్నర్ నరసింహన్ ఆయన చేత ప్రమాణం చేయిస్తారు. హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా 6న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ బోసలే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

రెండు నెలలపాటు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించి తరువాత జస్టిస్ బోసలేను పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమించే అవకాశాలున్నట్లు న్యాయవర్గాలు తెలిపాయి. ప్రస్తుత సీజే గుప్తా ఆరునపదవీ విరమణ చేయాల్సి ఉండగా  రెండో తేదీ నుంచి నెలరోజుల పాటు హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో ఒకటో తేదీనే ఆయనకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలకనుంది. ఆ తరువాత ప్రభుత్వం... కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్ర లా కమిషన్‌కు చైర్మన్‌గా గుప్తాను ప్రభుత్వం నియమించే అవకాశముంది. దీనిపై ప్రాథమికంగా ఓ నిర్ణయానికొచ్చినట్టు తెలిసింది.
 
 
 బార్ కౌన్సిల్ సభ్యుల్లో పిన్న వయస్కుడు
 జస్టిస్ బోసలే 1956, అక్టోబర్ 24న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రి బాబాసాహెబ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. బోసలే విద్యాభ్యాసమంతా ముంబైలోనే సాగింది. 1979 అక్టోబర్ 11న న్యాయవాద వృత్తి చేపట్టారు. క్రిమినల్, ఆస్తి చట్టాల కేసుల్లో అపార అనుభవం సాధించారు. 1986 నుంచి 1991 వరకు బాంబే హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, ప్రభుత్వ న్యాయవాదిగా, అసిస్టెంట్ పీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంత వరకు ఆయన బాంబే హైకోర్టులోనే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. దేశంలోని బార్ కౌన్సిళ్లకు ఎన్నికైన సభ్యుల్లో ఇప్పటి వరకు అత్యంత పిన్నవయస్కుడు ఈయనే.

వరుసగా మూడుసార్లు బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పుడే ఆయన న్యాయవాదులకు సంబంధించిన వ్యవహారాల్లో పలు సంస్కరణలు తెచ్చారు. తరువాత వాటిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా అమలు చేయడం ప్రారంభించింది. పలు అంతర్జాతీయ సదస్సుల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. 2001, జనవరి 22న బాంబే హైకోర్టు అదనపు న్యాయవాదిగా, 2003లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012, జనవరి 7న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. గతేడాది డిసెంబర్ 8న  ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

మరిన్ని వార్తలు