హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ బొసాలే

8 May, 2015 02:13 IST|Sakshi
హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ బొసాలే

సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ బొసాలే గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా ఈ నెల 6న పదవీ విరమణ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ బొసాలేను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తాత్కాలిక సీజేగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు అభినందించారు. అనంతరం జస్టిర్ బొసాలే శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లారు.

అపార అనుభవశాలి...
 జస్టిస్ బొసాలే 1956, అక్టోబర్ 24న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో పుట్టారు. ఈయన తండ్రి జస్టిస్ బాబాసాహెబ్ బొసాలే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. బొసాలే విద్యాభ్యాసం మొత్తం ముంబైలోనే కొనసాగింది. 1979 అక్టోబర్ 11న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. క్రిమినల్, ఆస్తి చట్టాల కేసులకు సంబంధించి అపార అనుభవం సాధించారు. 1986 నుంచి 1991 వరకు బొంబే హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, ప్రభుత్వ న్యాయవాదిగా, అసిస్టెంట్ పీపీగా పలు బాధ్యతలు నిర్వర్తించారు. దేశంలోని బార్ కౌన్సిళ్లకు ఎన్నికైన సభ్యుల్లో ఇప్పటివరకు అత్యంత పిన్నవయస్కుడు జస్టిస్ బొసాలే.

వరుసగా మూడుసార్లు బార్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికయ్యారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు న్యాయవాదిగా ఉన్నారు. ప్రభుత్వం తరఫున అనేక కీలక కేసుల్లో వాదనలు వినిపించారు. జస్టిస్ బొసాలే 2001, జనవరి 22న బొంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2003లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012, జనవరి 7న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. గతేడాది డిసెంబర్ 8న ఆయన ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

>
మరిన్ని వార్తలు