ఏపీ జ్యుడీషియల్‌ ప్రివ్యూ వెబ్‌సైట్‌లో టెండర్లు

25 Oct, 2019 04:57 IST|Sakshi
ఏపీ జ్యుడీషియల్‌ ప్రివ్యూ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న జస్టిస్‌ బి.శివశంకరరావు

ప్రజల పరిశీలనార్థం 104, 108, ఈఆర్‌సీల ప్రతిపాదనలు

న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావు వెల్లడి

సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో 104, 108, ఈఆర్‌సీ (ఆపరేషన్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్స్‌)ల ఏర్పాటుకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ఆంధ్రప్రదేశ్‌ జ్యుడీషియల్‌ ప్రివ్యూ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు న్యాయమూర్తి జస్టిస్‌ డాక్టర్‌ బి.శివశంకరరావు తెలిపారు. గుంటూరులోని ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో ఉన్న ప్రభుత్వ జ్యుడీషియల్‌ ప్రివ్యూ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జ్యుడీషియల్‌ ప్రివ్యూ ‘లోగో’ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా బాధ్యత గల పౌరులుగా ప్రజలు, కాంట్రాక్టర్లు, నిష్ణాతులు.. టెండర్లపై తమ అభ్యంతరాలు, సూచనలను ఈ నెల 31వ తేదీలోగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

రైతులకు ఉచితంగా బోర్లు వేసేందుకు ప్రభుత్వం కొనుగోలు చేయనున్న 200 రిగ్గుల యంత్రాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను పరిశీలించి,  అందులోని లోపాలను సవరించాలని చెప్పామన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజలకు తాగునీరు అందించేందుకు వీలుగా రూ.600 కోట్లతో టెండర్లు పిలుస్తున్నారని, ఆ టెండరును పరిశీలించి లోపాలను సవరించాలని అధికారులకు సూచించామని తెలిపారు. తర్వాత వాటిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి.. అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. గాలేరు నగరి – సుజల స్రవంతి పనులకు సంబంధించిన టెండర్‌ జ్యుడీషియల్‌ ప్రివ్యూకు వచ్చిందని, దానిని పరిశీలించాల్సి ఉందన్నారు.

మరిన్ని వార్తలు