తెలుగు భాష కంటే ఆంగ్లం సులభం : ఈశ్వరయ్య

28 Dec, 2019 18:04 IST|Sakshi

సాక్షి, అమరావతి : మెజారిటీ ప్రజలు అభీష్టం మేరకే ఆంగ్ల విద్యావిధానం ప్రవేశపెడుతున్నామని ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్  జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు.  కేవలం సంపన్న వర్గాలకు చెందిన వారు మాత్రమే దీనిని వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. శనివారం ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చాలా మంది పేదలు తమ పిల్లలను ఇంగ్లీషు మీడియంలో చదివించలేకపోతున్నారని ఆవేదన చెందారు. ప్రభుత్వ పాఠశాలల్లో అధ్యాపకులను పెంచి.. ఇంగ్లీష్ విద్యను పిల్లలకు అందిస్తామని తెలిపారు. ఉన్నత విద్య అభివృద్ధి చెందాలంటే ఇంగ్లీషు మీడియం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళ పిల్లలను తెలుగులోనే చదివిస్తున్నారా..? అని ప్రశ్నించారు.

సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలు పిల్లలు చదువుకుని అభివృద్ధి చెందకుడదనేలా కొందరి వైఖరి ఉంది. ఇంగ్లీషు మీడియంలో చదివితే వెనుకబడిన వర్గాల వారు అభివృద్ధి చెందుతారు. రాష్ట్రంలో ఆంగ్ల విద్యావిధానం తీసుకువస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మ్యానిఫెస్టోలోనే స్పష్టం చేశారు.ప్రపంచీకరణ నేపధ్యంలో ఆంగ్లభాష అవసరం. ప్రైవేట పాఠశాలలు విద్యార్థులు వద్ద ఫీజులు ఎక్కువగా తీసుకోవద్దు. కాలేజీలకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా ఫీజులు తగ్గించాలి. ఫిబ్రవరి నాటికి ఫీజులు నియంత్రణపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. తెలుగు భాష కంటే ఆంగ్లం నేర్చుకోవడం సులభం’ అని అన్నారు.

మరిన్ని వార్తలు