జస్టిస్‌ జయచంద్రారెడ్డి కన్నుమూత

10 Feb, 2020 02:27 IST|Sakshi

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు

రాయచోటి/అమరావతి: న్యాయకోవిదుడు, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కామిరెడ్డి జయచంద్రారెడ్డి (90) ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. బెంగళూరులోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు బంధువులు తెలిపారు. పదవీ విరమణ అనంతరం ఆయన శేష జీవితాన్ని అక్కడే గడుపుతున్నారు. కుమారుడు చనిపోవడంతో కోడలు, మనవళ్లతో బెంగళూరులో విశ్రాంత జీవితం గడుపుతున్న జస్టిస్‌ జయచంద్రరెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం బెంగళూరులోనే నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మదనపల్లె, రాయచోటి ప్రాంతాల్లో ప్రాథమిక, ఇంటర్మీడియట్‌ విద్యను అభ్యసించిన ఆయన మద్రాసు లా కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టాను అందుకున్నారు. తర్వాత మద్రాసు హైకోర్టులో క్రిమినల్‌ న్యాయవాదిగా వృత్తిని చేపట్టి అంచలంచెలుగా ఎదిగారు. 

కడప జిల్లా కుగ్రామంలో జననం 
వైఎస్సార్‌ జిల్లా సుండుపల్లి మండలం తిమ్మసముద్రం గ్రామం వండ్లపల్లెకు చెందిన కామిరెడ్డి క్రిష్ణారెడ్డి, చెన్నమ్మ దంపతులకు జయచంద్రారెడ్డి 1929లో జన్మించారు. ఈయనకు భార్య సరోజని, కుమారుడు, కుమార్తె ఉన్నారు.  

న్యాయవ్యవస్థలో మార్పులకు శ్రీకారం 
దేశంలోని పలువురు న్యాయకోవిదులతో కలిసి జయచంద్రారెడ్డి అనేక మార్పులకు నాంది పలికారు. ముఖ్యమైన కేసుల విషయంలో ప్రభుత్వాలకు, న్యాయాధిపతులకు ఆయన సలహాలు, సూచనలను అందించేవారు. ఉమ్మడి ఏపీ స్టేట్‌ లీగల్‌ బోర్డు చైర్మన్‌గా, అడ్వయిజర్‌గా సేవలందించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, లా కమిషన్‌ చైర్మన్‌గా, లా కమిషన్‌ ఇండియన్‌ కౌన్సెలర్‌గా.. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌గా ఆయన పలు కీలక పదవులు నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో యుగోస్లోవియా, రువాండ దేశాలతో జరిపిన న్యాయపరమైన కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ, జస్టిస్‌ పీఎన్‌ భగవతిల నుంచి  అవార్డులను అందుకున్నారు. 

ప్రస్థానం ఇలా.. 
- 1951లో మద్రాసు లా కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టాను పొందారు.  
1952లో మద్రాసు హైకోర్టులో సీనియర్‌ న్యాయవాది బసిరెడ్డి దగ్గర క్రిమినల్‌ లాయర్‌గా ఆయన న్యాయవాద ప్రస్థానాన్ని ప్రారంభించారు. 
1956లో ఆంధ్ర రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాదుకు మకాం మార్చి హైకోర్టు న్యాయవాదిగా కొనసాగారు.  
- 1956లోనే హైకోర్టు అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌) పనిచేశారు.  
- 1965–70లలో హైకోర్టు ప్రిన్సిపల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా కొనసాగారు. 
- 1975లో అడిషనల్‌ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన ఆయన అనేక హోదాలలో పనిచేస్తూ 1976లో పర్మినెంట్‌ న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 
- 1979–80లలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికై అనేక హోదాల్లో పనిచేశారు. 
1995–97 14వ లా కమిషన్‌ చైర్మన్‌గా బాధ్యతలను నిర్వర్తించారు.  
- 2001–2005 వరకు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌గా ఆయన సేవలను అందించారు.   

మరిన్ని వార్తలు