‘మధ్యవర్తిత్వం’తో కేసుల సత్వర పరిష్కారం

15 Dec, 2013 00:48 IST|Sakshi


శామీర్‌పేట్, న్యూస్‌లైన్: పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వ కోర్సులు ఎంతగానో దోహదం చేస్తాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలోని నల్సార్ లా యూనివర్సిటీలో శనివారం ఫ్యామిలీ డిస్ప్యూట్ రిసల్యూషన్ (ఎఫ్‌డీఆర్), ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిసల్యూషన్ (ఎఫ్‌డీఆర్) పీజీ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  చిన్న గొడవలతోనే ప్రజలు కోర్టులను ఆశ్రయిస్తున్నారని, దీంతో అనేక కేసులు కుప్పలుగా పేరుకుపోతున్నాయని చెప్పారు.
 
 ఇలాంటి కేసుల్లో ఇరువర్గాలకు సర్దిచెప్పి రాజీ కుదిర్చేందుకు మధ్యవర్తిత్వ కోర్సులు అభ్యసించిన విద్యార్థులు కృషి చేయాలని కోరారు. క్రిమినల్ కేసులు కూడా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమయ్యాయని పలు ఉదాహరణలతో ఆయన వివరించారు. నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఫైజాన్ ముస్తఫా మాట్లాడుతూ ఇప్పటివరకు 1100మంది పట్టభద్రులయ్యారని చెప్పారు. అనంతరం ఎఫ్‌డీఆర్, ఏడీఆర్ కోర్సులు పూర్తిచేసుకున్న 163మంది విద్యార్థులకు హైకోర్టు చీఫ్ జస్టిస్ చేతుల మీదుగా పట్టాలు ప్రదానం చేశారు. ఏడీఆర్ కోర్సులో మారెల్లి రాజేశ్వరి బంగారు పతకం సాధించగా, డాక్టర్ పున్న రాజారాం స్వర్ణ పతకం అందుకున్నారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిసల్యూషన్ (ఐసీడీఆర్) హైదరాబాద్ రీజనల్ సెంటర్ కార్యదర్శి కె.వి.సత్యనారాయణ, నల్సార్ లా యూనివర్సిటీ రిజిస్ట్రార్ విజేందర్ కుమార్, పట్టభద్రుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు