రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్‌ కనగరాజ్‌

12 Apr, 2020 03:10 IST|Sakshi
బాధ్యతలు స్వీకరిస్తున్న జస్టిస్‌ కనగరాజ్‌

గవర్నర్‌ నోటిఫికేషన్‌..

బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్‌ఈసీ

గవర్నర్‌ హరిచందన్‌తో మర్యాదపూర్వక భేటీ

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్‌ వి.కనగరాజ్‌ నియమితులయ్యారు. మద్రాస్‌ హైకోర్టులో తొమ్మిదేళ్లపాటు జడ్జిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఆయన ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్‌ అడ్వకేట్‌గా కొనసాగుతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామక అర్హతలు, పదవీ కాలంపై రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆర్డినెన్స్‌ తెచ్చిన విషయం తెలిసిందే. తాజా ఆర్డినెన్స్‌కు అనుగుణంగా శనివారం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్‌ నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని అందులో పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే జస్టిస్‌ కనగరాజ్‌ విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వివిధ విభాగాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టినట్టు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. 

ఎన్నికల కమిషనర్‌తో పలువురి భేటీ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే కనగరాజ్‌ విధులకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్, మున్సిపల్‌ శాఖ కార్యదర్శి శ్యామలరావు, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు, డీసీపీ విక్రాంత్‌ పాటిల్‌ తదితరులు వేర్వేరుగా కలిశారు. కనగరాజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్‌–డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ కూడా కలిసి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుత ఎన్నికల స్థితిపై చర్చించారు.
విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.కనగరాజ్‌ 

రికార్డు స్థాయిలో తీర్పులు
► తమిళనాడులోని సేలం, చెన్నైల్లో విద్యాభ్యాసం.  1972లో మద్రాస్‌ లా కాలేజీ నుంచి లా ఉత్తీర్ణత.
► 1973లో లాయర్‌గా ప్రాక్టీస్‌.
► 24 ఏళ్లపాటు న్యాయవాదిగా పనిచేశాక 1997 ఫిబ్రవరి 24న మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు. 
► తొమ్మిదేళ్లల్లో రికార్డు స్థాయిలో 69 వేల కేసులకు తీర్పులు. వీటిలో కీలకమైన 1,010 తీర్పులు లా జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. 
► 2002–05 మధ్య అంబేద్కర్‌ లా వర్సిటీ సెనేట్‌ మెంబర్‌గా పనిచేశారు. 
► 2006 జనవరిలో జడ్జిగా పదవీ విరమణ. అనంతరం సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌.

మరిన్ని వార్తలు