ఏపీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌గా జస్టిస్‌ నాగార్జునరెడ్డి ప్రమాణం

31 Oct, 2019 04:58 IST|Sakshi
ఏపీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌గా జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డితో ప్రమాణం చేయిస్తున్న గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌. చిత్రంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఉన్నతాధికారులు

ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్‌ విశ్వభూషణ్‌హరిచందన్‌ 

హాజరైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్‌పర్సన్‌గా ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం జస్టిస్‌ నాగార్జునరెడ్డిని గవర్నర్, ముఖ్యమంత్రి.. సన్మానించారు. పలు జిల్లాల నుంచి న్యాయవాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

కార్యక్రమంలో లోకాయుక్త జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్‌ బి.శేషశయనరెడ్డి, జస్టిస్‌ కృష్ణమోహన్‌రెడ్డి, బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ శంకరనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, మంత్రులు కొడాలి నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, ధర్మాన కృష్ణదాసు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, అనిల్‌కుమార్, ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్, అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్, మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ సీవీ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం జస్టిస్‌ నాగార్జునరెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మహేశ్వరికి మర్యాదపూర్వక ఫోన్‌ చేశారు. దీంతో ఆయన జస్టిస్‌ నాగార్జునరెడ్డిని హైకోర్టుకు ఆహ్వానించారు. నాగార్జునరెడ్డి గౌరవార్థం హైకోర్టులోనే తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులందరూ హాజరయ్యారు. 

దుర్గమ్మ సేవలో ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ నాగార్జునరెడ్డి 
ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్‌పర్సన్‌ సీవీ నాగార్జునరెడ్డి బుధవారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. జస్టిస్‌ నాగార్జునరెడ్డికి వేద పండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈవో ఎంవీ సురేష్‌బాబు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా