-

టెండర్ల న్యాయపరిశీలన బాధ్యతలు జస్టిస్‌ శివశంకర్‌రావుకు

12 Sep, 2019 04:59 IST|Sakshi

మూడేళ్ల పాటు ఈ బాధ్యతల నిర్వహణ

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

రూ.100 కోట్లు దాటిన టెండర్లన్నీ న్యాయ పరిశీలనకే

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెండర్ల విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి అక్రమాలకు ఏమాత్రం తావు లేకుండా పూర్తి పారదర్శకంగా వ్యవహరించేందుకు ఇటీవల ఏపీ మౌలిక సదుపాయాల (న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టాన్ని తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగా బుధవారం కీలక నియామకాన్ని చేపట్టింది. టెండర్ల ప్రక్రియ న్యాయ పరిశీలన బాధ్యతలను తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావుకు అప్పగించింది. అమలాపు రానికి చెందిన ఆయన మూడేళ్ల పాటు ఈ బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఈ మేరకు పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ భార్గవ ఉత్తర్వులిచ్చారు. 

ప్రమాణ స్వీకారం రోజే మాటిచ్చిన ముఖ్యమంత్రి..
గత ప్రభుత్వ హయాంలో టెండర్ల ప్రక్రియలో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఏమాత్రం పారదర్శకత లేకుండా రూ.వందల కోట్ల విలువైన పనులను కావాల్సిన వారికి కట్టబెట్టింది. దీనికి అడ్డుకట్ట వేసి టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. టెండర్లను మొదలు పెట్టడానికి ముందే ఆ ప్రక్రియను పరిశీలించేందుకు జ్యుడీషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని, ఈ విషయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ మౌలిక సదుపాయాల (న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టాన్ని తీసుకొచ్చింది. 

రూ.100 కోట్లు దాటిన టెండర్లన్నీ న్యాయ పరిశీలనకే...
కొత్త చట్టం రాకతో ఇకపై వివిధ శాఖల్లో రూ.100 కోట్లు అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన పనుల వివరాలను ముందు న్యాయ పరిశీలనకు పంపుతారు. న్యాయ పరిశీలన అనంతరం వచ్చే సూచనల ప్రకారం ఆ టెండర్‌పై నిర్ణయం తీసుకుంటారు. అంతేకాకుండా ప్రభుత్వ వనరులను సమర్థంగా, అనుకూలమైన విధానంలో ఉపయోగించడంలో భాగంగా రివర్స్‌ టెండరింగ్‌ కూడా నిర్వహిస్తారు. ఏ ఒక్కరికో పనులు కట్టబెట్టకుండా అర్హత కలిగిన వారందరికీ సమాన అవకాశాలు కల్పించడం కూడా ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. ఈ చట్టాన్ని ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చింది. 

ఏసీజేతో చర్చించిన ప్రభుత్వం
టెండర్ల ప్రక్రియ బాధ్యతలను న్యాయ పరిశీలనకు అప్పగించే విషయంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌తో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించింది. న్యాయ పరిశీలన బాధ్యతలను చేపట్టేందుకు విశ్రాంత న్యాయమూర్తి పేరును సిఫారసు చేయాలని ఏసీజేను కోరింది. ఈ నేపథ్యంలో ఆయన సిఫారసు మేరకు ఈ బాధ్యతలను జస్టిస్‌ శివశంకరరావుకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జస్టిస్‌ శివశంకరరావు నేపథ్యం..
జస్టిస్‌ శివశంకరరావు 1959 మార్చి 29వతేదీన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం సకుర్రు గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తండ్రి గవర్రాజు మాజీ సర్పంచ్‌. జస్టిస్‌ శివశంకరరావు ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేశారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎంఎల్‌  చేశారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ సాధించారు. 1984లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. పాలగుమ్మి సూర్యారావు, దువ్వూరి మార్కండేయుల వద్ద జూనియర్‌గా పని చేశారు. 1996లో జ్యుడీషియల్‌ సర్వీసుల్లోకి ప్రవేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పలు ప్రాంతాల్లో పనిచేశారు. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టు విభజన తరువాత తెలంగాణ హైకోర్టుకు ఆప్షన్‌ ఇచ్చారు. పలు సంచలన తీర్పులిచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 19న ఆయన పదవీ విరమణ చేశారు.

దర్మబద్ధంగా బాధ్యతలు నిర్వర్తిసా
‘‘ప్రభుత్వం ఎంతో నమ్మకంతో నాకు ఈ బాధ్యతలను అప్పగించింది. ధర్మబద్ధంగా, నిర్మొహమాటంగా వ్యవహరిస్తా. ప్రజల నమ్మకాన్ని వమ్ము కానివ్వను. నాకు అప్పగించిన బాధ్యతలను శక్తివంచన లేకుండా త్రికరణశుద్ధితో నిర్వర్తిస్తా. అవినీతి రహిత సమాజం కోసం నావంతు కృషి చేస్తా’’
–  జస్టిస్‌ శివశంకరరావు

మరిన్ని వార్తలు