సీబీఐ విచారణతోనే న్యాయం

24 May, 2017 01:51 IST|Sakshi
సీబీఐ విచారణతోనే న్యాయం

నారాయణరెడ్డి హత్యపై వైఎస్‌ జగన్‌ డిమాండ్‌

సాక్షి ప్రతినిధి, కడప: కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి నారాయణ రెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సీబీఐ విచారణతోనే న్యాయం జరుగుతుందన్నారు. ఆయన మంగళవారం వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జగన్‌ ఏం చెప్పారంటే...

‘‘పత్తికొండ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడు, పులివెందుల నియోజకవర్గం వేంపల్లె ఉప మండలాధ్యక్షుడు రామిరెడ్డిలను కిరాతకంగా హత్య చేశారు. ఇవాళ చంద్రబాబు అధికారం లో ఉండొచ్చు, రేపు మేము అధికారంలోకి రావొచ్చు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఐదున్నర కోట్ల మంది ప్రజల్లో ముఖ్యమంత్రి అయ్యేందుకు దేవుడు ఒక్కరికే అవకాశం ఇస్తాడు. అలాంటి పదవిలో కూర్చున్న వ్యక్తి ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించు కోవాలి. ప్రజలకు మంచి చేయాలి. ఆ ప్రజల దీవెనలతో, దేవుడి ఆశీస్సులతో మళ్లీ మళ్లీ ముఖ్యమం త్రిగా ఎన్నికవ్వాలి. సీఎంగా ఉన్నప్పుడు ప్రత్యర్థులను ప్రలోభాలకు గురిచేసి లొంగదీ సుకోవడం, వారు పదవులకు అనర్హులు కాకుండా కాపాడడం, ఒక అడుగు ముందు కేసి వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం, అప్పటికి కూడా ఎవరూ లొంగకపోతే వారిని హత్యలు చేయించడం.. ఇలాంటి పనులను ఏ సీఎం  అయినా ఎప్పుడూ చేయకూడదు.

ప్రజలు, దేవుడు మొట్టికాయలు వేస్తారు
ఇవాళ దుర్బుద్ధితో నారాయణరెడ్డిని చంపారు. దుర్బుద్ధితో ఏదైనా చేస్తే అది ఎదురుతన్నడం ఖాయం. రేపు అదే పత్తికొండ నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిచే పరిస్థితి వస్తుంది. నారాయణరెడ్డి కుటుంబం నుంచి అభ్యర్థి ఎన్నికల బరిలో నిలుస్తారు. భర్తను చంపేశారు.. ఏమవుతుంది? భార్య అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తారు. అంతేగానీ వారి(టీడీపీ) పథకం పారదు. అభ్యర్థే లేకుండా పోతే పార్టీయే లేకుండా పోతుందనుకుంటున్న వారి దుర్బుద్ధికి ప్రజలు, దేవుడు మొట్టికాయలు వేసే పరిస్థితి కచ్చితంగా వస్తుంది. నారాయణరెడ్డి హత్యపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది.

ఈ కేసులో సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రే నిందితుడు. ముఖ్యమంత్రి ఆశీస్సులతోనే ఈ హత్య జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వారి చేతుల్లోనే ఉన్న పోలీసు డిపార్టుమెంట్‌లో విచారణ జరిపిస్తే ఏం న్యాయం జరుగుతుంది? కాబట్టి సీబీఐతో విచారణ జరిపిస్తేనే న్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి తప్పు చేసినా, ఉప ముఖ్యమంత్రి తప్పు చేసినా జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుంది. అప్పుడే న్యాయ వ్యవస్థ బతుకుతుంది’’ అని జగన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు