'ఫ్యామిలీ ఫంక్షన్ గా మార్చేశారు'

6 Jun, 2015 13:03 IST|Sakshi
'ఫ్యామిలీ ఫంక్షన్ గా మార్చేశారు'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజధాని భూమిపూజను 'కుటుంబ ఫంక్షన్'గా మార్చేశారని వైఎస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయిన తనకు భూమిపూజ ఆహ్వానం రాలేదని మండిపడ్డారు. ఆ కార్యక్రమానికి ప్రతిపక్ష నాయకుడిని కూడా సీఎం కానీ, సీఎస్ కానీ ఆహ్వానించలేదు. దీన్ని బట్టి చంద్రబాబుది నీచ సంస్కృతి ఏంటో తెలుస్తుందన్నారు.

శుక్రవారం సాయంత్రం చంద్రబాబు నాయుడు భూమిపూజ కార్యక్రమానికి అటెండర్తో కార్డు పంపించి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయంపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు కూడా ఇస్తామని జ్యోతుల ఈ సందర్భంగా తెలియజేశారు. సమైక్య ఉద్యమకారుల్ని కూడా భూమి పూజకు ఆహ్వానించకపోవడం దారుణమని జ్యోతుల మండిపడ్డారు.

అదే విధంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి కూడా జ్యోతుల మాట్లాడారు. బలం లేని చోట్ల చంద్రబాబు అభ్యర్థులను పోటీలో ఎందుకు నిలుపుతున్నట్లో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ ఎన్నికల్లో ఎంతమంది రేవంత్ రెడ్డిలను వదిలి ఓటర్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారో చంద్రబాబు వెల్లడించాలన్నారు. రెండు స్థానాలే ఉన్నా విశాఖ, కృష్ణా జిల్లాల్లో వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇప్పించటంపై చంద్రబాబు దురుద్దేశం మరోసారి బయట పడిందని జ్యోతుల నెహ్రూ అన్నారు.

ఇదంగా గత సంప్రదాయాలకు విరుద్ధమని.. దీనిపై ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించామని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి విషయంలో చంద్రబాబు నాయుడు నీతిమంతంగా మాట్లాడుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉందని జ్యోతుల నెహ్రూ అన్నారు.

మరిన్ని వార్తలు