టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కేకే నామినేషన్

29 Jan, 2014 02:26 IST|Sakshi
  •  పలు పార్టీల మద్దతు కోరిన టీఆర్‌ఎస్  
  •  సురవరానికి కేసీఆర్ కృతజ్ఞతలు
  •  సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కే కేశవరావు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్‌ఎస్, సీపీఐ శాసనసభ్యులు, ఎంపీ వివేక్, కాంగ్రెస్‌కు చెందిన మాజీమంత్రి పి.శంకర్‌రావుతో కలిసి అసెంబ్లీ కార్యదర్శికి ఆయన నామినేషన్ పత్రాలు అందించారు. అనంతరం కాంగ్రెస్‌కు చెందిన మంత్రులను, ఎమ్మెల్యేలను కేకే కలిశారు. తమ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపినందుకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డికి టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు. సురవరంతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఢిల్లీ వచ్చినప్పుడు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి బర్దన్‌ను కూడా కలుస్తానని కేసీఆర్ ఆయనకు చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణకు కూడా కేసీఆర్ ఫోన్‌లోనే కృతజ్ఞతలు చెప్పారు. కేకే నామినేషన్ అనంతరం టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ వివిధ శాసనసభాపక్ష నాయకుల్ని కలిశారు. తమ అభ్యర్ధి గెలుపునకు సహకరించాల్సిందిగా వారిని కోరారు.
     
     టీ వాదులు కేకేను గెలిపిస్తారు
     మా పార్టీ తరఫున బరిలోకి దింపిన కె.కేశవరావును తెలంగాణవాదులంతా కలసి గెలిపిస్తారని భావిస్తున్నాం. మద్దతు కోసం బీజేపీ, ఎంఐఎంలను సంప్రదించాం. టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చినందుకు సీపీఐకి ధన్యవాదాలు.
     - ఈటెల రాజేందర్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
     
     మద్దతుపై నిర్ణయం తీసుకోలేదు
     రాజ్యసభ ఎన్నికల్లో కేశవరావుకు మద్దతివ్వాలని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ కోరారు. మద్దతు విషయంపై ఏ నిర్ణయం తీసుకోలేదు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎవరికి మద్దతిచ్చేది ప్రకటిస్తాం.
     - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
     
     ప్రభుత్వమే రెండుగా చీలింది
     కేశవరావుకు తెలంగాణ ఉద్యమంతో విడదీయరాని అనుబంధం ఉంది. మా పార్టీ నలుగురు ఎమ్మెల్యేలు ఆయనకు ఓటు వేస్తారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థత, కాంగ్రెస్ అధిష్టానం నాటకాలతో రాష్ట్ర ప్రభుత్వమే రెండుగా చీలింది. రాష్ట్ర మంత్రులు సైతం స్పీకర్ పోడియం వద్దకెళ్లి ఆందోళన చేయాల్సిన దుస్థితి.
      - నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
     
     మా పార్టీ నాయకులను అడగండి
     రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు సీపీఐ మద్దతిచ్చిందని, మీరూ ఇవ్వాలని ఈటెల రాజేందర్ కోరారు. మా పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలుండవని, పార్టీ నాయకత్వాన్ని సంప్రదించమని చెప్పాను. ఎవరికి మద్దతివ్వాలో మా పార్టీ కేంద్ర నాయకులే చెబుతారు. వారినే మద్దతు అడగండి. 
     - జూలకంటి రంగారెడ్డి, సీపీఎం శాసనసభాపక్ష నేత
>
మరిన్ని వార్తలు