‘వాస్తవాలు రాసేవారు భయపడాల్సిన పనిలేదు’

1 Nov, 2019 16:58 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మీడియాకు సంకెళ్లు అంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే రామచంద్రమూర్తి ఖండించారు. ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపేలా నిరాధారమైన, తప్పుడు వార్తల రాసేవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిని ప్రతిపక్షాలు వక్రీకరించడాన్ని రామచంద్రమూర్తి తప్పుబట్టారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై కొన్ని పత్రికలు అవాస్తవాలు రాయడం సరికాదన్నారు. ఆధారాలు లేని వార్తలు రాయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ప్రభుత్వంపై నిరాధారమైన, తప్పుడు వార్తలు రాసినప్పుడు వాటిని ఖండించే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని అన్నారు.

తాము రాసిన వార్తలకు.. రిజాయిండర్‌ను(ప్రతిస్పందన) కూడా ప్రచురిండం లేదని అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో వెనక ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అసాధారణంకాదని.. చట్టవిరుద్ధం అసలేకాదని పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ధంగానే జీవో జారీ చేయడం జరిగిందన్నారు. వాస్తవాలు రాసేవారు భయపడాల్సిన పనిలేదన్నారు. సమాజానికి మేలు చేయడానికికే ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చిందని తెలిపారు.

ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు : అమర్‌
ఏపీలో మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దుష్ప్రచారంపై  రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ విలేకర్లతో మాట్లాడారు. మీడియాకు లక్ష్మణ రేఖ ఉండాలని గతంలోనే పలు చర్చలు జరిగాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. పత్రికలకు ప్రత్యేకమైన స్వేచ్ఛ ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచకపోయినా.. ఎన్నో ఏళ్లుగా మీడియాకు స్వేచ్ఛ అనే అంశాన్ని అందరూ గౌరవిస్తున్నారని గుర్తుచేశారు. కానీ కొంతకాలంగా రాజకీయ అండదండలతో, కొందరికే స్వలాభం కలిగేలా వార్తలు ప్రచురిస్తున్నారని తెలిపారు.

వ్యక్తికి గానీ, సంస్థకు గానీ నష్టం కలిగేలా, బురద చల్లే ప్రయత్నాలు ఏ మీడియా చేయకూడదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న జీవోపై కొందరు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని.. నిజాలను నిర్భయంగా రాసే జర్నలిస్టులు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వారు రాసిన వార్తలు నిజమైతే.. కోర్టుల ద్వారా రక్షణ పొందవచ్చని అన్నారు.

మరిన్ని వార్తలు