కదులుతున్న ‘కే ట్యాక్స్‌’ డొంక

29 Aug, 2019 09:10 IST|Sakshi

లోతైన విచారణ దిశగా చర్యలు

దృష్టి సారించిన ప్రిన్సిపల్‌ సెక్రటరీ

సంబంధిత అధికారుల్లో మొదలైన అలజడి

సాక్షి, తిరుపతి : తిరుపతి రుయా ఆస్పత్రి వేదికగా ‘కే’ట్యాక్స్‌ మూలాలు వెలుగు చూశాయి. మాజీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ తనయుడు కోడెల శివరాం బినామీ పేర్లతో రుయా ఆసుపత్రిలో ల్యాబ్‌ నిర్వహణ బాగోతం ఆదివారం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఇదే విషయంపై అన్ని మీడియాల్లో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ల్యాబ్‌ నిర్వహణ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఈ వ్యవహారంపై కూపీ లాగుతున్నారు. దీంతో కోడెల తనయుడికి సహకరించిన రుయా అధికారుల బాగోతం ఎక్కడ బయటపడుతుందో అనే  ఆందోళన అధికారుల్లో స్పష్టమవుతోంది.

జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా ఇప్పటికే ల్యాబ్‌ నిర్వహణను రుయానే నిర్వహించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సంబంధిత కాంట్రాక్ట్‌ను రద్దు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటి వరకు ల్యాబ్‌ పేరుతో జరిగిన దోపిడీ వ్యవహారాన్ని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నారు. ఎక్కువ పరీక్షల సంఖ్యను చూపి, అధిక రేట్లతో రుయా నుంచి కోట్లు పిండుకున్నారు. ఇదిలా ఉండగా, ఆగస్టు 15వ తేదీన సెలవు రోజు, అయితే అదేరోజు రూ.1.5లక్షలకు బిల్లు పెట్టినట్లు తెలుస్తోంది.

సాధారణ రోజులకన్నా సెలువు రోజు ఆ స్థాయిలో పరీక్షలు జరిగాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బయట ల్యాబ్‌ల కన్నా కొన్ని పరీక్షల ధరలు ఎక్కువ చూపి దండుకున్నట్లు తెలుస్తోంది. ఇలా కే ట్యాక్స్‌ డొంక లాగితే అక్రమ దందా ఒక్కొక్కటే వెలుగు చూస్తోంది. 2014 నుంచి ల్యాబ్‌ ద్వారా చెల్లింపులపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే ఏమేరకు అక్రమాలు జరిగాయో తేటతెల్లమవుతుంది. ఇందుకు సహకరించిన వారెవరనే విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి.

సంబంధిత అధికారుల్లో మొదలైన అలజడి..
రాయలసీమకే పెద్దాసుపత్రిగా ఉన్న రుయాస్పత్రిలో అత్యాధునిక ల్యాబ్‌ నిర్వహణ పరికరాలు న్నాయి. అవసరమైన ప్రొఫెసర్లు, పీజీలు, టెక్నీషియనున్నారు. ల్యాబ్‌ నిర్వహణకు అవసరమయ్యే అన్ని సదుపాయాలున్నా అప్పటి టీడీపీ నేతల ఒత్తిడితో ల్యాబ్‌ నిర్వహణపై చేతులెత్తేశారు. కోడెల తనయుడు రుయా ల్యాబ్‌పై దృష్టి సారించారు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యూహాత్మకంగా సెంట్రల్‌ ల్యాబ్‌ నిర్వహణను చేజిక్కించుకున్నారు. ఇక అప్పటి నుంచి ల్యాబ్‌ నిర్వహిస్తూ నెలకు రూ. 30–40 లక్షల వరకు దండుకున్నారు. ఇలా  ఏడాదికి 4కోట్లకు పైగా, ఐదేళ్లలో 22కోట్లకు పైగా కోడెల బినామీకి చేరింది. రుయానే ఈ ల్యాబ్‌ నిర్వహించి ఉంటే రూ.1.80 కోట్లు, ఐదేళ్లకు రూ.9కోట్లతో నాణ్య మైన వైద్యపరీక్షలను రోగులకు అందించి ఉండవచ్చు. ఇలా ల్యాబ్‌తో పాటు ఆరోగ్యశ్రీ డాక్యుమెంటేషన్, మందుల పంపిణీలోనూ భారీ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. వీటన్నింటిపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. 

లోతైన విచారణ దిశగా చర్యలు
తిరుపతిలో కోడెల అక్రమాల బాగోతం వెలుగులోకి రావడం తీవ్ర సంచలనం రేపుతోంది. 2014 నుంచి శ్రీలక్ష్మీ వెంకటేశ్వర క్లీనికల్‌ ల్యాబ్‌ పేరుతో రుయా సెంట్రల్‌ ల్యాబ్‌ నిర్వహిస్తున్నారు. నెలకు 30 లక్షల నుంచి 40 లక్షల వరకు రుయా నిధులకు గండికొట్టారు. రుయాలో అత్యాధునిక ల్యాబ్‌ పరికరాలు ఉన్నా వాటిని పక్కనపెట్టి బయట వ్యక్తులకు అప్పగించడంపై పైస్థాయి అధికారులు దృష్టి సారించారు. దీనికి కారకులెవరు? సహకరించిన అధికారులెవరు? అనే విషయాలపై విచారణ చేపట్టనున్నారు. అలానే రోజువారీ పరీక్షలు, వాటికి చెల్లించిన మొత్తంపై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించనున్నట్లు ఓ అధికారి ద్వారా తెలుస్తోంది. ల్యాబ్‌ నిర్వహణపై ఇప్పుడే కొత్తకోణాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో రోజువారీ పరీక్షల డేటాను వెలికి తీసి, ఒక్కో పరీక్షకు ఏమేరకు చెల్లింపులు చేశారనే లోతైన విచారణ దిశగా చర్యలకు దిగనున్నారు.  ఇది చదవండి : చేసిన పాపాలే వెంటాడుతున్నాయి!!

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా