కబ్జాలకు కేరాఫ్ పీలేరు

14 Oct, 2013 04:04 IST|Sakshi

తిరుపతి, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైన పీలేరు భూకబ్జాలకు కేరాఫ్‌గా మారింది. అధికారం చాటున అడ్డూ అదుపూ లేకుండా ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసినా రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదు. భూ ఆక్రమణల్లో పట్టా భూములు, హైకోర్టు స్టే ఉన్న భూములను సైతం వదలక పోవడం చర్చనీయాంశమైంది. పీలేరు పట్టణానికి ఐదు కిలోమీటర్ల పరిధిలోని గుట్టలను సైతం ఆక్రమించుకుని ఇళ్ల స్థలాలుగా మార్చేశారు.

మరికొన్ని చోట్ల గుట్టలకు రాతి కుసాలు నాటేశారు. తాజాగా ఆదివారం పీలేరు శివారు ప్రాంతం తిరుపతి మార్గంలోని సర్వే నంబరు 658/2లోని భూమిని ఓ వైపు జనం, మరో వైపు జేసీబీలతో చదును చేయడం తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది. సర్వే నంబరు 658/2లో పీలేరు పట్టణం నాగిరెడ్డి కాలనీలో కాపురముంటున్న దేవులపల్లె నాగిరెడ్డి 1994లో వారణాసి భానురేఖ వద్ద 3 ఎకరాల 25 సెంట్ల భూమిని కొన్నాడు. కొంత మేర ప్లాట్లు వేసి విక్రయించాడు. ఇంకా కొంత పట్టాభూమిని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు.

ఈ భూమిలో ఆదివారం పలువురు ఆక్రమణకు పాల్పడినట్లు బాధితుడు నాగిరెడ్డి విలేకరులకు తెలిపాడు. తన పట్టాభూమిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల అనుచరులు ఆక్రమణకు పాల్పడ్డారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నాడు. అదేవిధంగా రెండు రోజుల క్రితం మదనపల్లె మార్గంలోని కళాకారుల భూమిపై హైకోర్టు స్టే విధించింది. ఈ భూముల్లోనూ ఆక్రమణకు పాల్పడ్డారని కళాకారులు ఆరోపిస్తూ పీలేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమైక్య ఉద్యమ చాటున రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వల్లే రెండు నెలల వ్యవధిలోనే భూదందాల పరంపర పతాక స్థాయికి చేరిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల భూదందాలపై వైఎస్సార్ సీపీ నేతలు హైదరాబాద్‌లోని ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో కేసు వేస్తామని ప్రకటించారు. మరోవైపు పీలేరు పట్టణానికి కూతవేటు దూరంలోని బోడుమల్లువారిపల్లె సర్పంచ్ రవీంద్రనాథరెడ్డి తన పంచాయతీ పరిధిలో దాదాపు రూ.వంద కోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆరోపించారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోకపోతే దీక్ష చేస్తానని ఆయన ఇప్పటికే ప్రకటించారు.
 

>
మరిన్ని వార్తలు