పట్టు జారిన లంగరు

19 Oct, 2019 09:03 IST|Sakshi

కొనసాగుతున్న బోటు ఆపరేషన్‌

రంపచోడవరం/దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట పున్నమి బోటును వెలికితీసేందుకు ధర్మాడి సత్యం బృందం విశ్వప్రయత్నం చేస్తోంది. శుక్రవారం ఉదయం పోర్టు అధికారి కెప్టెన్‌ ఆదినారాయణ ఆధ్వర్యంలో బోటును వెలికితీసేందుకు లంగరు, ఐరన్‌ రోప్‌ను ఉచ్చు మాదిరిగా గోదావరిలోకి వదిలి పొక్లెయిన్‌ సాయంతో లాగారు. అయితే, లంగరు బోటుకు తగులుకుని పట్టు జారిపోయింది. సాయంత్రం మరోసారి లంగరును నీటిలోకి వదిలి ఐరన్‌ రోప్‌ను రెండుసార్లు బోటు చుట్టూ గోదావరిలో విడిచిపెట్టారు. అదే సమయంలో వర్షం కురవడంతో వెలికితీసే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడింది. శనివారం తిరిగి పనులు ప్రారంభించనున్నారు. రెండు రోజులపాటు చేపట్టిన ఆపరేషన్‌లో పలుమార్లు లంగరు, ఐరన్‌ రోప్‌ బోటుకు తగులుకోవడంతో.. పట్టు జారినప్పటికీ నదీగర్భం నుంచి సుమారు 70 అడుగుల మేర ఒడ్డు వైపునకు బోటు జరిగినట్లు పోర్టు అధికారి తెలిపారు.

లంగరు, రోప్‌ లాగుతున్న సమయంలో బోటు ఉన్న ప్రాంతంలో బుడగలతో కూడిన డీజిల్‌ ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, దుర్వాసన వస్తోందని తెలిపారు. బోటులో ఉన్న డిస్పోజబుల్‌ గ్లాసుల కట్ట శుక్రవారం పైకి తేలింది. ప్రస్తుతం బోటు 40 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. నది ఒడ్డు నుంచి సుమారు 250 అడుగుల దూరంలో బోటు ఉన్నట్లు తెలిపారు. మరో పది మీటర్లు ఒడ్డు వైపు  చేర్చగల్గితే బోటును సునాయాసంగా వెలికితీయవచ్చని చెబుతున్నారు. లంగరు వేసిన ప్రతిసారి బోటు ఇంచుమించు పది నుంచి ఇరవై మీటర్లు మేర ముందుకు వస్తోందని, బోటు ఆపరేషన్‌లో జాప్యం జరుగుతోంది తప్ప, దానిని వెలికి తీయడం తథ్యమని ధర్మాడి సత్యం చెప్పారు. బోటుకు లంగరు తగిలించే పని చేసేందుకు విశాఖపట్నానికి చెందిన అండర్‌ వాటర్‌ సర్వీస్‌ బృందాన్ని ధర్మాడి సత్యం సంప్రదించగా>.. నదిలో దిగేందుకు ఆ బృందం విముఖత వ్యక్తం చేసింది. 

మరిన్ని వార్తలు