కదం తొక్కిన కలం యోధులు అనంతపురం

22 Sep, 2014 02:03 IST|Sakshi
కదం తొక్కిన కలం యోధులు అనంతపురం

క్రైం :  పింఛన్ల అక్రమ తొలగింపు వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన ‘సాక్షి' స్టాఫ్ ఫొటోగ్రాఫర్ వీరేష్, విలేకరి రమణారెడ్డిలపై టీడీపీ కార్యకర్తల దాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు గళమెత్తారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ
 
 జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు

 సాక్షి, అనంతపురం : జర్నలిస్టులపై దాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. శింగనమలలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు, ప్రజాసంఘాలు, వైఎస్సార్ సీపీ నాయకులు ఆర్టీసీ బస్టాండ్ నుంచి పోలీసుస్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎస్‌ఐ రామారావుకు వినతి పత్రం అందజేశారు. గుంతకల్లులోని ప్రెస్‌క్లబ్ నుంచి పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ రాస్తారోకో చేశారు. దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ అర్బన్ సీఐ శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. పెద్దవడుగూరులో ర్యాలీ నిర్వహించి.. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కళ్యాణదుర్గంలో ఏపీయూడబ్ల్యూజే మండల శాఖ అధ్యక్షుడు రామాంజినేయులు ఆధ్వర్యంలో  రిపోర్టర్లు, యువరాజ్యం, నెపోలియన్ ప్రజాసంఘాల నాయకులు ర్యాలీ చేశారు.  సీఐ వంశీధర్ గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. రాయదుర్గంలో సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా, ఏఐఎస్‌ఎఫ్ నాయకులతో కలిసి ఆర్‌అండ్‌బీ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.  తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. తర్వాత డిప్యూటీ తహశీల్దార్ బాలకిషన్‌కు వినతిపత్రం అందజేశారు. రాప్తాడులో వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం, రైతు సంఘం నాయకులతో కలిసి బస్టాండ్ కూడలి నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం అక్కడ రెండు గంటల పాటు ఆందోళన నిర్వహించారు. ధర్మవరంలో కాలేజీ సర్కిల్ నుంచి టవర్‌క్లాక్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. తర్వాత పట్టణ సీఐ ఆనందరావుకు వినతిపత్రం అందజేశారు. పుట్టపర్తిలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి పుల్లయ్య ఆధ్వర్యంలో రిపోర్టర్లు, వైఎస్సార్‌సీపీ, సీపీఐ, కాంగ్రెస్, బీజేపీ నాయకులు స్థానిక సత్యమ్మగుడి నుంచి ర్యాలీగా వెళ్లి పోలీసుస్టేషన్‌లో సీఐ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. హిందూపురంలోని అంబేద్కర్ సర్కిల్‌లో వైఎస్సార్‌సీపీకి చెందిన  మునిసిపల్ కౌన్సిలర్లు రెండుగంటల పాటు ఆందోళన చేశారు. పెనుకొండలో జర్నలిస్టులు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని ఆర్డీఓ కార్యాలయం ఎదుట మౌనదీక్ష చేపట్టారు. అనంతరం ఆర్డీఓ వెంకటేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఉరవకొండలో జర్నలిస్టులు, విద్యార్థి సంఘాల నాయకులు స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి ర్యాలీగా వెళ్లి తహశీల్దార్ బ్రహ్మయ్యకు వినతిపత్రం సమర్పించారు. గుత్తి పట్టణంలోని గాంధీసర్కిల్‌లో రాస్తారోకో చేశారు. అక్కడి నుంచి పోలీసుస్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి..సీఐ మోహన్‌కు వినతిపత్రం అందజేశారు.



 

మరిన్ని వార్తలు