రయ్.. య్.. య్..

6 Jun, 2015 10:51 IST|Sakshi
రయ్.. య్.. య్..

రేపు ఉదయం 11.30 గంటలకు ల్యాండ్ కానున్న తొలి విమానం
కడప-బెంగుళూరు మధ్య సర్వీస్
ప్రారంభోత్సవానికి సీఎం,కేంద్ర మంత్రుల రాక
నెలలో కడప-హైదరాబాద్ మధ్య కొత్త సర్వీస్
 
 కడప సెవెన్‌రోడ్స్ : దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కల ఎట్టకేలకు సాకారం కాబోతోంది. ఆదివారం కడప విమానాశ్రయం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నిర్మల సీతారామన్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి వై.సుజనా చౌదరిలు హాజరవుతున్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎయిర్ పెగాసెస్ సంస్థకు చెందిన విమానం ఆదివారం ఉదయం 10.40 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి 11.30 గంటలకు కడప విమానాశ్రయంలో ల్యాండ్ కానుంది. ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత ఈ తొలి విమాన సర్వీసు 11.50 గంటలకు కడపలో టేకాఫ్ తీసుకుని 12.35 గంటలకు బెంగుళూరుకు చేరుకుంటుంది. టిక్కెట్లు అవసరమైన వారు ఎయిర్ పెగాసెస్ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాలి.

ఇప్పటికే పలువురు తమ టికెట్లను రిజర్వు చేసుకున్నారు. కడప నుంచి బెంగుళూరుకు టిక్కెట్ ధర రూ.1234 ఉంటుందని విమాన సంస్థ ప్రతినిధులు ప్రకటించినప్పటికీ డిమాండును బట్టి టిక్కెట్ ధరలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ప్రయాణీకుల రద్దీ పెరిగే కొద్ది ట్రిప్పులు పెంచే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. నెల రోజుల్లో హైదరాబాదు-కడప మధ్య కొత్త విమాన సర్వీసు కూడా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్టణం తర్వాత ఐదవదిగా కడప విమానాశ్రయం ప్రారంభమవుతోంది.

     1939-45 మధ్య రెండవ ప్రపంచ యుద్ద కాలంలో విమానాలకు ఫ్యూయల్ నింపుకోవడానికి కడపలో ఎయిరోడ్రమ్ ఏర్పాటు చేశారు. అయితే స్వాతంత్య్రం అనంతరం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. విమానాలు, హెలికాఫ్టర్లకు ఫ్యూయల్ నింపుకోవడానికి, ఎవరైనా ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు జిల్లా పర్యటనలకు వచ్చినపుడు ఇక్కడ దిగేందుకు మాత్రమే ఎయిరోడ్రమ్ వినియోగించుకునే వారు. ఆ సందర్భాల్లో మినహా ఇక్కడ జనసంచారం కూడా ఉండేది కాదు.

2004లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. పలు విద్యా సంస్థలు, పరిశ్రమలతోపాటు మౌలిక సదపాయాల కల్పన జరిగింది. పరిశ్రమల స్థాపనకు వీలుగా ఇప్పుడున్న ఎయిర్‌పోర్టు సమీపంలో సుమారు ఏడు వేల ఎకరాల భూమిని సేకరించి ఏపీఐఐసీ మెగా ఇండస్ట్రియల్ పార్కును అప్పట్లో ఏర్పాటు చేశారు. వస్త్ర వ్యాపార దిగ్గజం బ్రాండిక్స్, ఓ ప్రైవేటు స్టీల్ కంపెనీతోపాటు కొన్ని ఐటీ కంపెనీలు కడపలో తమ యూనిట్లు నెలకొల్పేందుకు ఆసక్తి చూపాయి.

ఒక ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే విమానాశ్రయం ముఖ్య భూమిక పోషిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కడప విమానాశ్రయ అభివృద్ధికి నడుం బిగించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)-రాష్ట్ర ప్రభుత్వం మధ్య మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ) జరిగింది. ఎయిర్‌పోర్టు అభివృద్ధికి అవసరమైన భూమి, నీరు, విద్యుత్, రహదారులు, నెట్ కనెక్టివిటీ, సెక్యూరిటీ వంటి కనీస వసతులను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చాలన్నది ఎంఓయూలోని సారాంశం. దీంతో వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. అప్పటికే ఎయిర్‌పోర్టుకు ఉన్న స్థలానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 287.69 ఎకరాల భూమిని సేకరించి ఏపీఐఐసీ ద్వారా ఏఏఐకి అప్పగించారు. తొలుత 34 కోట్ల రూపాయలు అవసరమవుతుందని భావించినా అన్నీ పూర్తయ్యేసరికి ఈ వ్యయం రూ.42 కోట్లకు చేరింది.
 
  ఎయిర్ పోర్టు తొలి దశలో రన్‌వేని ఆరు వేల అడుగులతో విస్తరింపజేశారు. కడప విమానాశ్రయ పరిధిలోని 1060 ఎకరాల చుట్టూ 12 కిలోమీటర్ల మేర ప్రహరీ ఏర్పాటు చేశారు. 2010లో రెండవ దశ కింద ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) భవనం, టెర్మినల్, ఇంటర్నల్ రోడ్లను ఏర్పాటు చేశారు. 2012 జూన్ నాటికే ఎయిర్‌పోర్టు ప్రారంభానికి అవసరమైన అన్ని హంగులు సమకూరాయి. అయితే, చిన్నచిన్న కారణాలు చూపెడుతూ ప్రారంభోత్సవం వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఆదివారం ఈ విమానాశ్రయం ప్రారంభం కాబోతోంది.

మరిన్ని వార్తలు