‘సైబర్‌’ నేరాలకు ‘చెక్‌’ పడేదెలా?

25 Sep, 2019 11:36 IST|Sakshi
కడపలో ఏర్పాటు చేసిన సైబర్‌ క్రైం నేరాల పరిశోధన విభాగ కార్యాలయం

సాక్షి, కడప అర్బన్‌ : సమాజంలో ప్రస్తుతం కళ్లకు కన్పించని నేరగాళ్లు ఎంచక్కా ప్రజల ఖాతాల్లోని డబ్బులను వివిధ రకాలుగా కాజేస్తూ బెంబేలెత్తిస్తున్నారు. బ్యాంక్‌ మేనేజర్, బీమా పాలసీ అధికారుల పేర్లతోనేగాక, ఇతర వ్యక్తుల మాదిరిగా ఫోన్‌లు చేసి మాయమాటలు చెప్పి మన దగ్గర సమాచారం తీసుకుంటారు. వారి మాటలు నమ్మి  బాధితులు వేల రూపాయల నుంచి లక్షలాది రూపాయలను సైతం నష్ట పోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ సైబర్‌ నేరాలను నివారించే మార్గాలపై కథనం. 

సైబర్‌ నేరాలు– రకాలు 
⇔ ఓటీపీ, క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్టు మోసాలకు పాల్పడే అపరిచిత వ్యక్తులు తాము ప్రజలకు సంబంధించిన బ్యాంక్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నామని చెబుతారు. వివరాలు చెప్పకపోతే కార్డు స్తంభించి పోతుందనీ, వాటిని సరిచేస్తామనీ చెప్పి కార్డు వివరాలను అడిగి సమాచారం తెలుసుకుంటారు. తరువాత సెల్‌ఫోన్‌కు వచ్చే ఒన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ)ను వారిచేతనే చెప్పించుకుంటారు. ఆ తర్వాత  వారి ఖాతాలో ఉన్న సొమ్మును కొల్లగొడుతుంటారు. ఇలాంటి నేరాలు తరచుగా ప్రస్తుతం జరుగుతున్నాయి. బ్యాంక్‌ అధికారులు ఎట్టి పరిస్థితిల్లోను ఫోన్‌ ద్వారా తమ ఖాతాదారుల బ్యాంక్‌ ఖాతా వివరాలను అడగరు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాల్ని ఉంది. 
⇔ ఓఎల్‌ఎక్స్, క్వికర్‌ మోసాలను అపరిచిత వ్యక్తులు ఆర్మి అధికారుల వేషధారణలో ఓఎల్‌ఎక్స్‌/క్వికర్‌ అకౌంట్‌లను తెరిచి ఫేక్‌ మొబైల్‌ నెంబర్లను జతపరిచి ఇంటర్‌నెట్‌ నుంచి తీసుకున్న కార్లు, సెల్‌ఫోన్‌ల ఫొటోలను జతపరుస్తారు. వాటిని అతి తక్కువ ధరలకే అమ్ముతామని యాడ్స్‌ ఇస్తారు. వాటిని నిజమని నమ్మి ప్రజలు వాటికోసం తమ డబ్బును అపరిచిత వ్యక్తులు ఇచ్చిన బ్యాంక్‌ అకౌంట్‌లకు పంపడం ద్వారా అటు వస్తువులు రాక ఇటు పంపిన డబ్బు రాక మోసపోతున్నారు. 

లాటరీ మోసాలు 
అపరిచిత వ్యక్తులు సాధారణ ప్రజల సామాజిక మాధ్యమాల సమాచారాన్ని తీసుకుని వాటి ద్వారా ప్రజలకు ఎక్కువ మొత్తంలో లాటరీ తగిలిందనో, మీరు చేసిన షాపింగ్‌ ద్వారా కూపన్స్‌ వచ్చాయనో పరిపరి విధాలుగా ఇ–మెయిల్‌కు గానీ, తమ ఫోన్‌కు మెసేజ్‌గాని పంపడం ద్వారా డబ్బును సునాయాసంగా తస్కరిస్తున్నారు. 

సామాజిక మాధ్యమాల ద్వారా మోసాలు 
ప్రజలు సామాజిక మాధ్యమాలలో  తమ సమాచారాన్ని (పేరు, నివాసం, వృత్తి, ఫొటోలు మొదలగునవి) పొందుపర్చడం ద్వారా ఆన్‌లైన్‌ మోసగాళ్లు ఆ సమాచారాన్ని కాజేస్తారు. ఆ ఫొటోలను మార్ఫింగ్‌ ద్వారా అసభ్యంగా చిత్రీకరించి సదరు వ్యక్తులను బ్లాక్‌మెయిల్‌ చేసి లొంగతీసుకోవడం, వినకపోతే ఆ ఫోటోలను అందరికి చేరవేస్తామని బెదిరించడం, అసభ్యకమరమైన కామెంట్లను పోస్ట్‌ చేయడం, ఫేక్‌ ప్రొఫైల్‌ ఐడీని సృష్టించి ప్రేమవ్యవహారంతో నమ్మించి వంచించడం. కుల,మత, వర్గాల మధ్య వైషమ్యాలను పురిగొల్పడం ద్వారా వ్యక్తి స్వేచ్ఛకు, సమాజ శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్నారు. 
   సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి 
   బ్యాంక్‌ అధికారులమంటూ ఎవరైనా ఫోన్‌ చేసి ఏటీఎం కార్డులపై ఉన్న నంబర్లుకానీ, పిన్‌ నెంబర్లుకానీ అడిగితే  చెప్పరాదు. 
   ప్రకటనలకుగానీ, ఆన్‌లైన్‌లో యాడ్‌లకు గానీ ఆకర్షితులై వాహనాలను, సెల్‌ఫోన్‌లను కొనుగోలు చేయరాదు. 
   వీసాలు, విదేశాల్లో ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల నుంచి బయటపడాలంటే గుర్తింపు ఉన్న ఏజెన్సీలను స్వయంగా సంప్రదించాలి. 
ప్రతి ఒక్కరూ షాపింగ్‌లు చేసినా, ఏటీఎం సెంటర్లలో డబ్బులను డ్రా చేసినా, ఇతర లావాదేవీలను జరిపిన తరువాత వారి ఏటీఎం‘పిన్‌ నంబర్‌’ను ఖచ్చితంగా తరచుగా మారుస్తుండాలి. 

కడపలో సైబర్‌ క్రైం అండ్‌ ఫ్రాడ్‌ సెల్‌ పోలీసు విభాగం  
జిల్లాలో సైబర్‌ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువ కావడంతో ఎస్పీ అభిషేక్‌ మహంతి పర్యవేక్షణలో ఈ ఏడాది ప్రారంభంలో కడప నగరంలోని తాలూకా పోలీస్‌ స్టేషన్‌ పైభాగాన, సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌కు అనుబంధంగా ‘సైబర్‌ క్రైం, ఫ్రాడ్‌ సెల్‌ ’ను ఏర్పాటు చేశారు. ఈ విభాగానికి ఇప్పటికి 107 ఫిర్యాదులు అందాయి. సీసీఎస్‌ డీఎస్పీ ఎంసీ రంగనాయకులు పర్యవేక్షణలో ఎస్‌ఐ లింగాల జీవన్‌ రెడ్డి, తమ సిబ్బందితో కలిసి కేసులను దర్యాప్తు చేస్తున్నారు. 

బాధితుల్లో ఎక్కువగా విద్యావంతులే
సమాజంలో సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోతున్న వారిలో ఎక్కువగా విద్యావంతులే ఉన్నారు. బాధితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య రైతులు, ఇతర విభాగాలకు చెందిన వారితో పాటు అండ్రాయిడ్‌ ఫోన్, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న వారే అధికంగా ఉంటున్నారు. సైబర్‌నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.
– ఎంసీ రంగనాయకులు, సీసీఎస్‌ డీఎస్పీ, కడప 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు