గల్ఫ్‌దేశానికి వెళ్లి.. తిరిగిరాని లోకాలకు

15 Jun, 2019 10:07 IST|Sakshi

సాక్షి, లక్కిరెడ్డిపల్లె(కడప) : గత పది సంవత్సరాలుగా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వర్షాలు రాక పొలం పంట సాగు చేసుకోలేక, రూ.లక్షలు వెచ్చించి అప్పులు చేసి బిడ్డల్ని ప్రయోజకులిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో అందిరినీ వదిలి పొట్టకూటి కోసం కువైట్‌ వెళ్లాడు లక్కిరెడ్డిపల్లె మండలం పందేళ్లపల్లె గ్రామంకు చెందిన సోముగారి లక్షుమయ్య. అక్కడికి వెళ్లి నాలుగు నెలలు కూడా గడవక మునుపే లక్షుమయ్య (34)ను మృత్యువు రోడ్డు ప్రమాదంలో కబళించింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కువైట్‌లో ఆయన డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ పది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు  అక్కడి వారు  ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేశారు. లక్షుమయ్య మరణవార్త విన్న కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. 14 రోజులుగా భర్త, బంధువులు, మిత్రులు మృతదేహం కోసం కంటిమీద కునుకు లేకుండా ఎప్పుడోస్తాడా అని ఎదురు చూస్తున్నారు. గురువారం అర్థ రాత్రి మృతదేహాన్ని ఇండియాకు పంపినట్లు సమాచారం అందింది.

కువైట్లోని ఇండియాకు చెందిన పలువురు తమ వంతు ఆర్థిక సహాయంతో మృతదేహాన్ని ఇండియాకు రప్పించడానికి సహకరించారు. ఇంటికి చేరిన మృతదేహాన్ని చూసిన భార్య పిల్లలు బోరున విలపించారు. నాన్న  మా బాగు కోసం మమ్మల్ని విడిచి వెళ్లావా అంటూ ఇద్దరు కుమార్తెలు కన్నీటిపర్వతమవుతూ దుఖించడం అందరినీ కలచివేసింది. శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరారు. 

ఎంపీ సహాయంతో..
కువైట్‌లో మృతి చెందిన లక్షుమయ్య మృతదేహాన్ని మద్రాసు ఎయిర్‌ పోర్టు నుంచి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తన సొంత ఖర్చులు వెచ్చించి ప్రత్యేక అంబులెన్సు ద్వారా పందిళ్లపల్లె గ్రామం బురుజుపల్లెకు రప్పించేందు ఏర్పాటు చేశారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఎంపీ మిథున్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.  

మరిన్ని వార్తలు