చీప్‌ ట్రిక్స్‌!

13 Mar, 2017 11:12 IST|Sakshi
టీడీపీ నేతలను వెంటాడుతున్న అభద్రతాభావం
►  వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైఎస్‌ వివేకాకు ఓటేస్తారనే అనుమానం
► పాండేచ్చేరి క్యాంపులో మతవిశ్వాసం ఆధారంగా ప్రమాణాలు
 ఎమ్మెల్యే ఆది, ఎంపీ రమేష్‌ చర్యలపై ఓటర్లు విసుగు
సాక్షి ప్రతినిధి, కడప:ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కోసం టీడీపీ కసరత్తు చేస్తోంది. కస్టడీలో ఉన్నంతవరకూ సరే ఆపై పోలింగ్‌బూత్‌కు ఓటరు వెళితే ఓటు దక్కదనే అభద్రతాభావం వెంటాడుతోంది. మత విశ్వాసం అనుగుణంగా సొమ్ము చేసుకోవాలని నాయకులు చీప్‌ట్రిక్స్‌ ఎంచుకున్నారు.
 
ఆయా మతాల దేవుళ్ల  చిత్రపటాలపై ప్రమాణాలు చేయిస్తున్నారు. వెనుకబడిన వర్గాలను టార్గెట్‌ చేస్తూ ప్రమాణాల పర్వానికి తెరలేపారు. అన్ని రకాలుగా కృషి చేస్తున్నామ్యాజిక్‌  ఫిగర్‌ దాటలేదనే ఆవేదన మరోవైపు వెంటాడుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘పార్టీది బలుపు కాదు వాపు’ మాత్రమేనని టీడీపీ నేతలు గ్రహించారు. ఆపై పోలింగ్‌కు వెళితే ఓట్లు లభించవనే ఆలోచనలో పడ్డారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ పరిణామాన్ని కట్టడి చేయాలనే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. అందులోభాగంగా క్యాంపులో ఉన్న ఎంపీటీసీలతో ప్రమాణాలు చేయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. క్రిస్టియన్‌ అయితే ఏసుప్రభువు, హిందువు అయితే వెంకటేశ్వరుడు, ఈశ్వరుడు, ముస్లిం మైనార్టీలను అల్లాపై ప్రమాణాలు చేయించాల్సిందిగా ఒత్తిడి పెంచుతున్నారు. పాండిచ్చేరి క్యాంపులో ఉన్న అందరితో ప్రమాణాలు చేయిస్తున్నారంటే, కేవలం వెనుకబడిన వర్గాలపై మాత్రమే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందర్నీ ఒకేలా చూస్తే తిరగబడే ప్రమాదం ఉందని ఏరికోరి కొంతమందిపై మాత్రమే ఇలాంటి చీప్‌ట్రిక్స్‌కు పాల్పడుతోన్నట్లు సమాచారం. కాగా తెలుగుతమ్ముళ్లు వైఖరిపై శిబిరంలో ఉన్న అనేక మంది మదనపడుతోన్నట్లు తెలుస్తోంది. 
 
ప్రత్యామ్నాయ ఓటు పొందే దిశగా.....
నిరక్షరాస్యులు, అనారోగ్యవంతులుగా ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ  ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఓటును సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రత్యేక చట్టం ఉంది. ప్రత్యామ్నాయంగా రిటర్నింగ్‌ అధికారి అనుమతి తీసుకొని తన బదులుగా మరొకరితో ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఇలాంటి వెసులుబాటు ఉంది. చట్టంలో ఉన్న లొసుగుల కారణంగా పోలింగ్‌కు వెళితే ఓటు దక్కదనే కొందరి ఓట్లను ఇలాంటి ప్రత్యేక అనుమతులు ద్వారా ప్రత్యామ్నాయ ఓటుహక్కు పొందాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయ ఓటుకు దరఖాస్తు చేసుకున్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు వాస్తవంగా చదువుకున్నావారా? కాదా? ఆయా ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్లకు నామినేషన్‌ సందర్భంగా సంతకం చేశారా? లేదా? ఇతరత్రా అధికారిక పత్రాలల్లో సంతకాలు చేశారా? మినిట్స్‌లో సైతం వేలిముద్రలు వేశారా? ఇలా అన్ని కోణాల్లో పరిశీలించిన పిదప రిటర్నింగ్‌ అధికారి అనుమతి దక్కే అవకాశం ఉంది. అయితే అధికార దర్పంతో ప్రత్యామ్నాయ ఓట్లు పొందాలనే దిశగా టీడీపీ శ్రేణుల వ్యవహార శైలి కన్పిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. 
 
బ్యాలెట్‌ తెలిసిపోతుందని బెదిరింపులు....
 ఓవైపు మత విశ్వాసాలకు అనుగుణంగా ప్రమాణాలు, మరోవైపు అనుమానితుల ఓట్లు ప్రత్యామ్నాయ మార్గంలో దక్కించుకోవాలనే ఎత్తుగడ. ఇంకోవైపు ‘‘ఏ బ్యాలెట్‌ పత్రం ఎవరికి కేటాయించారు,  బ్యాలెట్‌ పత్రంలో ఎవ్వరికి ఓటు వేశారన్న విషయం మాకు స్పష్టంగా తెలుస్తోంది’’ అనే బెదిరింపులకు తెలుగుతమ్ముళ్లు తెగబడతున్నట్లు సమాచారం. ప్రభుత్వం మాదే, ఎన్నికల కమిషన్‌ నుంచి అన్ని వివరాలు తెప్పిస్తామంటూ ఓటర్లను భయాందోళనకు గురిచేస్తున్నట్లు పలువురు చెప్పుకొస్తున్నారు. ఈవిషయంలో ఓ ఎంపీ, మరో ఎమ్మెల్యే దూకుడుగా ఉంటున్నట్లు సమాచారం. ఎవరిని ఎలాంటి ప్రలోభాలకు గురిచేయాలి,  ఎలా బెదిరించాలనే దిశగా ఆయా నాయకులు చర్యలు ఉన్నట్లు సమాచారం. ఇంతా చేస్తున్న మ్యాజిక్‌ ఫిగర్‌కు తగ్గ సంఖ్యాబలం క్యాంపునకు చేరకపోవడంతో తెలుగుతమ్ముళ్లు హైరానా పడుతోన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ శిబిరంలో క్రియాశీలకంగా ఎమ్మెల్యే, ఎంపీలు ఇరువురు ఆదివారం జిల్లాలోనే వివిధ నాయకులతో మంతనాలు నిర్వహించినట్లు తెలిసింది.  తెలుగుతమ్ముళ్లు ఎత్తుగడలను ఎన్నికల కమిషన్‌ నియంత్రించి  స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్‌ నిర్వహించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు.   
>
మరిన్ని వార్తలు