రెండేళ్లలో పులివెందులలో మరింత ప్రగతి

23 Aug, 2019 08:22 IST|Sakshi
అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి  

త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేయండి

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఆదేశం

సాక్షి, వేముల : పులివెందుల నియోజకవర్గంలో రెండేళ్లలో మార్పు తీసుకువచ్చే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సభా భవనంలో గురువారం మండల అభివృద్ధి పనులపై సమీక్ష అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పులివెందుల మున్సిపాలిటీ, చక్రాయపేట మండలాలు మినహా అన్ని మండలాల్లో అభివృద్ధి పనులపై సమీక్షలు పూర్తయ్యాయన్నారు. ఆయా గ్రామాలలో సమస్యలను, పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆయా శాఖల ప్రధాన కార్యాలయానికి పంపాలన్నారు. అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందిస్తే అవసరమైన నిధులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి విడుదల చేయిస్తానన్నారు. ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. సత్వరమే పూర్తి చేసేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పులివెందుల నియోజకవర్గాన్ని రెండేళ్లలో అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అధికారులు పనిచేయాలన్నారు. ఇందుకోసం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించినప్పుడే మార్పు సాధ్యమవుతుందన్నారు. 

మహిళలకు 
ఆసరా శ్రీజ పాల డెయిరీలు.. :
 
నియోజకవర్గంలో శ్రీజ పాల డెయిరీ మహిళలకు ఆసరాగా నిలుస్తుందని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలో అన్ని కేంద్రాలలో శ్రీజ పాల డెయిరీల ఏర్పాటుకు సంస్థ ముందుకొచ్చిందన్నారు.  సంస్థలో 75వేలమంది మహిళలు సభ్యులుగా ఉన్నారన్నారు. ఈ డెయిరీలకు పాలు పోసేవారికి 15రోజులకు బిల్లులు తమ ఖాతాలలో జమ అవుతాయన్నారు. ప్రతి గ్రామంలోనూ శ్రీజ పాల డెయిరీలను ఏర్పాటు చేసి పాల ఉత్పత్తిని పెంచుకునేలా సంస్థ కృషి చేస్తోందన్నారు. గ్రామాలలో ప్రతి ఇంటిలో పాడి పశువుల పెంపకం ద్వారా కుటుంబాలు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చునన్నారు. పులివెందుల నియోజకవర్గంలో శ్రీజ పాల డెయిరీ ఏర్పాటుకు సంస్థ ఇప్పటికే గ్రామాల్లో సర్వే చేసిందన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, డ్వామా పీడీ యధుభూషణ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల నాయకులు నాగేళ్ల సాంబశివారెడ్డి, మండల పరిశీలకులు లింగాల రామలింగారెడ్డి, మాజీ ఎంపీపీ జనార్థన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు రాజారెడ్డి, మరకా శివకృష్ణారెడ్డి, బయపురెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు శ్రీరామిరెడ్డి, మల్‌రెడ్డి, చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు