కరోనా నివారణకు వైఎస్‌ అవినాష్‌రెడ్డి రూ.2కోట్లు..

26 Mar, 2020 08:05 IST|Sakshi

కలెక్టర్, పులివెందుల ఓఎస్డీలకు ఫోన్‌లో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సూచన

సాక్షి, పులివెందుల: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా జిల్లాలో అన్ని రకాల చర్యలు చేపట్టాలని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్‌ హరికిరణ్, పులివెందుల పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డిలకు ఫోన్‌ ద్వారా సూచించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో పరిస్థితులపై తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్‌కు పలు సూచనలు, సలహాలు అందజేశారు. కరోనా వ్యాప్తి నివారణకు చేపట్టే చర్యలను తన ఎంపీ నిధులనుంచి రూ.2కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు కలెక్టర్‌కు తెలిపారు. ఈ నిధుల ద్వారా క్వారంటైన్లు, ఆసుపత్రుల్లోని ఐసోలేషన్‌ వార్డుల్లో అన్ని రకాలా వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం పులివెందుల ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డిలతో చర్చించారు.

ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ పులివెందులలో క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాటు గురించి ఆరా తీశారు. సెంటర్‌లో అన్ని రకాల అధునాతన పరికరాలతో వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డులో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలన్నారు.

నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయించకుండా ప్రజలకు లభ్యమయ్యేలా చూడాలన్నారు. కరోనా వైరస్‌ అదుపులోకి వచ్చేంతవరకు అధికారులందరూ కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. ప్రజలు కూడా స్వీయ నిర్భందం పాటించాలని ఆయన కోరారు. కరోనా వైరస్‌ నివారణకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని రకాల చర్యలు చేపట్టారన్నారు. కరోనా వైరస్‌ నివారణకు ఎలాంటి అవసరాలు ఉన్నా.. వెంటనే తనకు తెలియజేస్తే అందుకు తగిన చర్యలు చేపడతానని అధికారులకు ఆయన సూచించారు. 

మరిన్ని వార్తలు