కడచూపునూ దూరం చేసిన కరోనా

24 May, 2020 04:10 IST|Sakshi
సతీష్‌రెడ్డి మృతదేహం గల బాక్సు వద్ద వైద్య సిబ్బంది, పోలీసులు, స్థానికులు

ఉక్రెయిన్‌లో కడప విద్యార్థి దుర్మరణం

కష్టాలకోర్చి మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించిన తల్లిదండ్రులు

కువైట్‌ నుంచి వచ్చిన తల్లికి కరోనా పాజిటివ్‌.. 

కుమారుడి మృతదేహాన్ని చూసేందుకూ దక్కని అవకాశం

కువైట్‌లో చిక్కుకుపోయిన తండ్రి చెల్లి, కుటుంబ సభ్యులకు దక్కని చివరిచూపు

సాక్షి, కడప/పెనగలూరు: కరోనా రూపంలో విధి ఆడిన వింత నాటకమిది. ఉక్రెయిన్‌లో మృత్యువాతపడిన కుమారుడి మృతదేహాన్ని లక్షలాది రూపాయలు వెచ్చించి స్వగ్రామానికి రప్పించగలిగినా.. ఆ కుటుంబంలోని సభ్యులెవరూ కడచూపునకు నోచుకోలేదు. వివరాల్లోకి వెళితే.. 

► కడప జిల్లా పెనగలూరు మండలం బెస్తపల్లెకు చెందిన దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 
► వారిని ఉన్నత స్థితిలో చూడాలనుకున్న తల్లిదండ్రులు పదేళ్లుగా కువైట్‌లో కష్టపడుతున్నారు. పెద్దవాడైన సతీష్‌రెడ్డిని ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చదివిస్తున్నారు. 
► కుమార్తె బెస్తపల్లెలోనే అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ ఏడో తరగతి చదువుతోంది. చదువు నిమిత్తం రెండేళ్ల క్రితం ఉక్రెయిన్‌ వెళ్లిన సతీష్‌రెడ్డి 13 రోజుల క్రితం అక్కడ ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డాడు. 
► తమ కలలు నెరవేరుస్తాడనుకున్న కుమారుడు అకస్మాత్తుగా తనువు చాలించిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కుమిలిపోయారు. కొడుకు మృతదేహాన్ని కడసారైనా చూడాలని నిర్ణయించుకున్నారు. 
► కొడుకు మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు కువైట్‌ నుంచే ప్రయత్నాలు చేశారు. వారు కూడా ఇక్కడకు రావడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. 
► అక్కడి పరిస్థితుల దృష్ట్యా తండ్రి రాలేని పరిస్థితి నెలకొంది. తల్లి మాత్రం కువైట్‌ నుంచి కుమారుడి మృతదేహం కంటే రెండు రోజులు ముందే స్వగ్రామానికి చేరుకుంది. 
► కువైట్‌ నుంచి రావడంతో ఆమెను రాజంపేట పరిధిలోని క్వారంటైన్‌కు తరలించారు. శుక్రవారం పరీక్షలు నిర్వహించగా ఆమెకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. 
► బిడ్డ మృతదేహం శనివారం వేకువజామున చెన్నైకి.. అక్కడి నుంచి నేరుగా అంబులెన్స్‌లో బెస్తపల్లికి తీసుకొచ్చారు. తల్లికి కరోనా పాజిటివ్‌ కావడంతో ఆమె కుమారుడిని కడసారి చూసుకోలేని దుస్థితి తలెత్తింది. 
► సతీష్‌రెడ్డి చెల్లి, ఇతర కుటుంబ సభ్యులను సైతం మృతదేహం వద్దకు రానివ్వలేదు. 
► మృతదేహం ఉన్న బాక్సును నేరుగా పూడ్చి వేసి అధికారులే అంత్యక్రియలు జరిపించారు. 
► ‘దేవుడా.. ఏం పాపం చేశాం. కడచూపునకూ నోచుకోకుండా చేశావ్‌’ అంటూ సతీష్‌రెడ్డి కుటుంబీకులు బోరుమనడం అక్కడి వారి హృదయాలను ద్రవింపజేసింది.

మరిన్ని వార్తలు