క్రీడల్లో కుమార్తెను గెలిపించి..

8 Jan, 2020 08:37 IST|Sakshi
బ్రాంజ్‌ మెడల్‌ అందుకుంటున్న వరలక్ష్మి, మృతి చెందిన వెంకటలక్షుమ్మ

కుమార్తెను ఉన్నతస్థాయి క్రీడాకారిణిగా తీర్చిదిద్దిన ఓ తల్లి

భర్తతో ఏర్పడిన వివాదంతో ఆత్మహత్య చేసుకున్న వైనం

వైఎస్సార్‌ జిల్లాలో ఘటన  

సాక్షి, కడప స్పోర్ట్స్‌: కుమార్తెను మంచి క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలనుకున్న ఆ తల్లి ఆకాంక్ష నెరవేరింది కానీ.. ఆ కుమార్తె విజయాన్ని ఆనందించే క్షణాలు మాత్రం కన్నతల్లికి లేకుండా పోయాయి. జాతీయ స్థాయిలో తన కుమార్తె సాధించిన ఘనత చూడకుండానే కన్నుమూసింది. క్రీడల్లో కుమార్తెను గెలిపించగలిగిన ఆ మహిళ.. కుటుంబ కలహాలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన వైఎస్సార్‌ జిల్లాలో జరిగింది. కడపలో ఓ అపార్ట్‌మెంట్‌లో భార్యభర్తలు గంగయ్య, వెంకటలక్షుమ్మ (45) వాచ్‌మెన్‌లుగా పనిచేసేవారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్న కుమార్తె వరలక్ష్మికి చదువుతో పాటు క్రీడల్లో ఆసక్తి ఉంది. తల్లి వెంకటలక్షుమ్మ వరలక్ష్మిని ప్రోత్సహిస్తూ వచ్చింది.

కళాశాల నుంచి అండర్‌–19 ఎస్‌జీఎఫ్‌ షూటింగ్‌బాల్‌ జట్టుకు ఎంపికైంది. గతనెలలో ప్రకాశం జిల్లాలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ రాష్ట్ర స్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో పాల్గొనే రాష్ట్ర జట్టుకు కూడా ఎంపికైంది. ఈనెల 1 నుంచి న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న షూటింగ్‌బాల్‌ పోటీల్లో పాల్గొని కాంస్య పతకం గెలిచింది. అయితే ఢిల్లీ వెళ్లేందుకు డబ్బును ఇవ్వడానికి తండ్రి నిరాకరించగా.. తల్లి సమకూర్చింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ ప్రారంభమైనట్లు స్థానికులు చెబుతున్నారు. మరికొందరు మాత్రం పెద్ద కుమార్తెను పనిలోకి తీసుకువెళ్లే విషయంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగి వెంకటలక్షుమ్మ కలత చెందిందంటున్నారు.

వెంటిలేటర్‌పై..
ఈనెల 2న వెంకటలక్షుమ్మ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఆమెను వెంటనే హాస్పిటల్‌లో చేర్పించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించగా సోమవారం ఆమె తుదిశ్వాస విడిచింది. అయితే ఈ విషయాన్ని ఢిల్లీకి వెళ్లిన కుమార్తెకు చెప్పలేదు. ఢిల్లీ నుంచి వరలక్ష్మి ఫోన్‌ ద్వారా అమ్మతో మాట్లాడేందుకు ప్రయత్నించినా.. కుటుంబ సభ్యులు మభ్యపెడుతూ వచ్చారు. సోమవారం ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో ఏపీ జట్టు ప్రతిభ కనబరిచి మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. అమ్మతో మాట్లాడే అవకాశం రాకపోవడంతో అనుమానం వచ్చి మంగళవారం సాయంత్రం తనకు తెలిసిన వాళ్లకు ఫోన్‌ చేసి వాకబు చేయగా ఆమెకు అసలు విషయం తెలిసింది. దీంతో కోచ్‌ ఆమెను విమానంలో తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా