కత్తిపోటుపై కన్నెర్ర

26 Oct, 2018 13:39 IST|Sakshi
పులివెందులలో ర్యాలీ నిర్వహిస్తున్న మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, తదితరులు

పెల్లుబికిన జనాగ్రహం

జిల్లా అంతా నిరసనలు, ర్యాలీలు.. ఆందోళనలు

దాడిని ఖండించిన పార్టీశ్రేణులు, ప్రజలు

పులివెందులలో మాజీఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి నిరసన

జగన్‌ కోలుకోవాలని 101 టెంకాయలు కొట్టిన రఘురామిరెడ్డి

రాజంపేటలో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం

రాయచోటిలో కొవ్వొత్తులతో ప్రదర్శన

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం ఘటనతో జిల్లా ఉలిక్కిపడింది. దాడి వార్త తెలియగానే పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. సాధారణ వ్యక్తి కాదు.. రాష్ట్ర స్థాయిలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నాన్ని అభిమానులు, నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేక పోయారు. విషయం తెలియగానే పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.. సీఎం డౌన్‌ డౌన్‌....ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.  ప్రధాన రోడ్లపై బైఠాయించి రాస్తారోకో, మానవహారాలు చేపట్టారు. రాజంపేటలో సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతేకాకుండా వైఎస్‌ జగన్‌ ఆరోగ్యం కుదుటపడి కోలుకోవాలని పలువురు పూజలు నిర్వహించారు.

సాక్షి కడప : విశాఖ ఎయిర్‌పోర్టులో గురువారం మధ్యాహ్నం ప్రతిపక్ష నేతపై దాడి విషయం తెలియగానే పార్టీ నేతలు, శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు నిరసనలు చేపట్టారు. కడపమాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి నేతృత్వంలో రాజారెడ్డి భవన్‌ నుంచి ఆర్టీసీ బస్టాండు వద్దకు చేరుకుని వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం మెయిన్‌రోడ్డు మీదుగా...పాత బస్టాండు నుంచి పూల అంగళ్ల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం అక్కడనే పార్టీ శ్రేణులు మానవహారం నిర్వహించారు. ఎక్కడికక్కడ పులివెందులలో స్వచ్ఛందంగా వైఎస్‌ జగన్‌కు సంపూర్ణ సంఘీభావం తెలుపుతూ దుకాణాలు, షాపులు మూసివేసి నిరసన తెలిపారు.

ర్యాలీలు.. మానవహారాలు..
జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం విషయం తెలియగానే  ఆందోళన చేపట్టారు. కడపలో పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి కోటిరెడ్డిసర్కిల్, ఎన్టీఆర్‌ సర్కిల్‌ మీదుగా ఏడురోడ్ల కూడలి వరకు  ర్యాలీ చేపట్టారు. బద్వేలులో సమన్వయకర్త డాక్టర్‌ వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో బద్వేలులో ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు ర్యాలీ చేపట్టారు.  బస్టాండు వద్ద  మానవహారం నిర్వహించారు.  పోరుమామిళ్లలో కూడా పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.  కమలాపురం బైపాస్‌రోడ్డులో పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. దీంతో కడప–బళ్లారి ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. చెన్నూరు, వీఎన్‌పల్లె, సీకే దిన్నెలలో కూడా రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు చేపట్టారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో కూడా పార్టీ నేతలు  నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఎర్రగుంట్ల, జమ్మలమడుగులలో రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధ్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. ముద్దనూరుతోపాటు మిగిలిన మండలాల్లో కూడా పార్టీ కార్యకర్తలు ధర్నాలు చేపట్టారు. రైల్వేకోడూరులోని టోల్‌గేట్‌ వద్ద వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ శ్రేణులు రోడ్డుపైనే బైఠాయించాయి. దీంతో కడప–తిరుపతి మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి.  

రాజంపేటలో చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం
రాజంపేటలో పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను తగులబెట్టారు.  

రాయచోటిలో కొవ్వొత్తులతో ప్రదర్శన
వైఎస్‌ జగన్‌పై దాడిని నిరసిస్తూ రాయచోటి వైఎస్సార్‌ సీపీ నాయకుడు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.   వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మదన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కూడా కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టిరు.

వేంపల్లెలో కార్యకర్త ఆత్మహత్యాయత్నం
జిల్లాలోని వేంపల్లెలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త, బక్కనగారిపల్లెకు చెందిన లక్ష్మినారాయణ ఆత్మహత్యకు యత్నించారు.  నాలుగురోడ్ల కూడలిలో మానవహారం నిర్వహిస్తున్న సమయంలో కత్తితో గొంతు కోసుకునేందుకు యత్నిస్తుండగా  పోలీసులు అడ్డుకున్నారు. ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు కడప–వేంపల్లె–రాయచోటి ప్రధాన రహదారిలో మొద్దులు, టైర్లు,కట్టెలు వేసి పెద్ద ఎత్తున మంటలు వేశారు. దీంతో  ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.

ప్రజాదరణ చూసి ఓర్వలేకనే
మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

పులివెందుల : వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం వైఎస్‌ జగన్‌పై దాడికి నిరసనగా పులివెందులలో ఆయన వైఎస్సార్‌సీపీ నేత శివప్రకాష్‌రెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ప్రధాన రహదారుల వెంబడి పూలంగళ్ల సర్కిల్‌ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి చేసిన వ్యక్తిని, అతని వెనుక ఉన్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలన్నా రు. నిందితుడు ఉపయోగించిన కత్తి కోడి పం దేలకు ఉపయోగించే కత్తి కాబట్టి ఆ కత్తిని ఫోరెనిక్స్‌ ల్యాబ్‌కు పంపించి టెస్ట్‌లు చేయించాలన్నారు. సహజంగా ఇలాంటి కత్తులకు విషం పూస్తారన్నారు. వైఎస్‌ జగన్‌పై దాడి జరగడంతో రాష్ట్ర యావత్తు దిగ్భ్రాంతికి గురైందన్నారు. నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజాదరణ పొందుతున్న అటువంటి నాయకుడిపై దాడి చేయడం అమానుషమన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రజాదరణ రోజు రోజుకు పెరుగుతోందని.. ప్రతి సర్వేలో నూ కాబోయే సీఎంగా వైఎస్‌ జగన్‌ పేరు చెబు తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక కొంతమంది వ్యక్తులు కలిసి ఇలాంటి చర్యలకు పా ల్పడి ఉండవచ్చునన్నారు. ప్రతిపక్షనేతగా జగన్‌మోహన్‌రెడ్డికి భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నా రు. ఆయనపై దాడి జరిగినా కూడా ప్రభుత్వ పెద్దలు కుంటి సాకులు చెప్పడం చాలా నీచమైన చర్యగా ఆయన అభివర్ణించారు.

మరిన్ని వార్తలు