కదిరి టీడీపీ ఇన్‌చార్జ్‌ కందికుంటకు షాక్‌!

12 Sep, 2019 08:16 IST|Sakshi
కందికుంట కబ్జా చేసి ప్రహరీ నిర్మించిన స్థలం ఇదే

సాక్షి, అనంతపురం(కదిరి) : తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ పాపం పండింది. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన చేసిన కబ్జాలు కోకోల్లలుగా ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసి గెలుపొందిన ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి తన ఎన్నికల ప్రచారంలో ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. తాను బాధితులకు అండగా నిలబడతానని బాధితులకు గట్టి భరోసా నిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం బాధితుల పక్షాన నిలిచి కందికుంట కబ్జా చేసిన 3 ఎకరాల స్థలాన్ని బాధితులకు దక్కేలా చేసి వారి మన్ననలు పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే...కదిరి–హిందూపురం రహదారిని ఆనుకొని వీవర్స్‌ కాలనీ వద్ద ముస్లింలకు చెందిన సర్వే నం.70–3లో ఉన్న 3.04 ఎకరాల స్థలాన్ని కందికుంట వెంకటప్రసాద్‌ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కబ్జా చేసి, తప్పుడు పత్రాలు సృష్టించి తన సమీప బంధువుల పేరుమీద రిజిష్ట్రర్‌ కూడా చేయించుకున్నాడు. ఆ భూమికి సంబందించిన వ్యక్తులు 2018 జూలై 14న చదును చేయడానికి వెళితే ఆ రోజు కందికుంట తన అనుచరుల ద్వారా వారిపై దాడి చేయించాడు. తర్వాత ఆ భూమిలోకి ఎవరూ ప్రవేశించకుండా చుట్టూ ప్రహరీ నిర్మించి ముందు వైపు పెద్ద గేట్‌ అమర్చి తాళం వేశాడు. 

బాధితుల పక్షాన నిలిచిన ఎమ్మెల్యే 
కందికుంట కబ్జా చేసిన స్థలం ఆ పేదలకే దక్కాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి బాధితుల పక్షాన రెవెన్యూ అధికారులను సంప్రదించి కదిరి ఆర్‌డీఓ కోర్టులో కేసు వేశారు. ఆర్‌డీఓ రికార్డులతో పాటు రిజిస్ట్రేషన్‌ పత్రాలు, పట్టాదారు పాసుపుస్తకాలు పరిశీలించిన మీదట కందికుంటకు సమీప బంధువులైన దాసరి వెంకటేష్, చంద్రశేఖర్, ఈయన సతీమణి డి.నాగమణిల పేరుమీద చెరో 1.52 ఎకరాలు చొప్పున సర్వే నెం.70–3లో పొందిన 3.04 ఎకరాలకు సంబందించిన పట్టాదారు పాసుపుస్తకాన్ని రద్దు చేస్తున్నట్లు ఆర్‌డీఓ రామసుబ్బయ్య తన కోర్టులో బుధవారం తీర్పును వెలువరించారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా జేసీ కోర్టును ఆశ్రయించవచ్చని  సూచించారు. 

కందికుంటకు సహకరించిన అధికారులల్లో వణుకు 
కందికుంట కబ్జా చేసిన స్థలాన్ని తన సమీప బంధువుల పేరుమీద పట్టాదారు పాసుపుస్తకం పొందేందుకు అప్పట్లో ఆయనకు సహకరించిన రెవెన్యూ అధికారులు, కొందరు సిబ్బందికి ఆర్‌డీఓ ఇచ్చిన తీర్పు గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఆ భూమి రిజిస్ట్రేషన్‌ చేయించే సమయంలో అప్పట్లో కాసేపు రెవెన్యూ రికార్డులను ఆన్‌లైన్‌లో తారుమారు చేసి, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన కొద్ది క్షణాల్లోనే మళ్లీ యథాతథంగా మార్పు చేసిన విషయం కూడా ఇప్పటి రెవెన్యూ అధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరిపితే ఒకరిద్దరిపై సస్పెన్షన్‌ వేటు పడే అవకాశాలున్నాయని రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కందికుంట పలువురు తన అనుచరుల పేరుమీద పలు తేదీల్లో రిజిష్ట్రేషన్‌ చేయించి చివరకు మళ్లీ తన బంధువుల పేరుమీద రిజిష్ట్రర్‌ చేయించుకొని పలు లింక్‌ డాక్యుమెంట్లు సంపాదించారు. కాగా ఆర్‌డీఓ తీర్పుతో కందికుంట బాధితులు త్వరలోనే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోనున్నారు. 

>
మరిన్ని వార్తలు